కేరళ కొల్లం జిల్లాలో పండ్లలో బాంబుపెట్టి ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాలక్కాడ్ ఏనుగు మృతికి కారణమైన నిందితుల కోసం వెతుకుతుండగా కొల్లం ఘటన అనుమానితులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
ఈ రెండు ఏనుగులు ఒకే తరహాలో బాంబు పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల మృతి చెందాయి. వాటి నోళ్లలో గాయాలు అయిన కారణంగా పలు రోజుల పాటు ఆహారాన్ని తినలేకపోయాయి.
"కొల్లం జిల్లా పతన్పురంలో ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేశాం. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి."
-అటవీ శాఖ అధికారి, కొల్లం
అయితే నిందితుల లక్ష్యం ఏనుగు కాదని.. అడవి పందులు, జింకల కోసం ఈ బాంబులు పెట్టిన ఆహారం ఉంచారని వెల్లడించారు అధికారులు. అయితే ఆహారాన్ని గమనించిన ఏనుగు దానిని తినేందుకు ప్రయత్నించగా నోటిలో పేలినట్లు పేర్కొన్నారు. బాంబు పేలుడుతో ఏనుగు దవడకు గాయమైందని.. ఈ కారణంగా ఆహారం తినలేక ఆకలితో చనిపోయిందని చెప్పారు.
గర్భవతి ఏనుగు మృతి నిందితుల కోసం గాలింపు..
పాలక్కాడ్ జిల్లాలో ఏనుగు మృతికి కారణమైన ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు అధికారులు. ఏప్రిల్ 5న ఒకరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.