దిల్లీలో దాదాపు 29 శాతం ప్రజలు కొవిడ్-19 వైరస్ ప్రభావానికి గురైనట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు జరిపిన రెండో దఫా సెరోలాజికల్ సర్వేలో 29.1 శాతం ప్రజల్లో కొవిడ్ యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించామని తెలిపారు. ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్లు సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.
దిల్లీలో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడంలో భాగంగా అక్కడి ప్రభుత్వం సెరోలాజికల్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేను దిల్లీ ప్రభుత్వం జులైలో ఒకసారి చేపట్టగా.. ఇప్పుడు రెండోసారి నిర్వహించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ ఈ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడం, ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా పలు ప్రాంతాల్లో ఈ సర్వేలు చేపట్టనున్నారు.
సర్వే చేస్తారిలా..
- ఇన్ఫెక్షన్ బారినపడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని ఈ సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తారు.
- సెరోలాజికల్ సర్వేలో ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారు.
- ర్యాండమ్‌గా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అక్కడివారి అనుమతితో రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తారు.
- తొలి దశలో జరిపిన సర్వేలో దిల్లీలో దాదాపు 22శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరమిదే..