భాజపాపై మరోమారు విమర్శలు గుప్పించారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్. 2014లో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపాకు ఎన్సీపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ప్రకటించడం... ఎన్డీఏ నుంచి శివసేనను దూరం చేసేందుకు వేసిన రాజకీయ ఎత్తుగడ అని పేర్కొన్నారు. భాజపా, శివసేన మధ్య దూరాన్ని పెంచేందుకు తాను ప్రయత్నించినట్లు అంగీకరించారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భాజపా నాయకులు తనను కలిసినట్లు చెప్పారు పవార్. కానీ, ఎన్సీపీ భాజపాతో ఎప్పటికీ కలవబోదని, అవకాశం ఉంటే శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తాం లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటామని ప్రధాని మోదీకి తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు పవార్. ప్రజాస్వామ్యంలో భాజపాయేతర పార్టీలు పని చేసే హక్కు ఉందని భాజపా నమ్మటం లేదని ఆరోపించారు.
శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ముఖాముఖిలో కీలక విషయాలు పంచుకున్నారు శరద్ పవార్.
" 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివసేన-భాజపా కూటమి అధికారంలోకి రాకూడదనే ఆ ప్రకటన చేశాను. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని గ్రహించి.. భాజపా ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తానని ప్రకటించాను. కానీ, ఆ మంత్రం పనిచేయలేదు. శివసేన ప్రభుత్వంతో కలిసింది. కూటమి పూర్తి పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2014లో కేంద్రంలో భాజపా అధికారంలో ఉంది. మహారాష్ట్రలోనూ అధికారంలో ఉంటే శివసేనకు నష్టం జరుగుతుందని తెలుసు. భాజపాకు బయట నుంచి మద్దతు ప్రకటన కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగమే. భాజపా, శివసేన మధ్య దూరం పెంచేందుకు నేను ఆ పని చేసినట్లు అంగీకరిస్తున్నా."
- శరద్ పవార్, ఎన్సీపీ అధినేత
అవాస్తవం..
గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం భాజపా నేతలతో మంతనాలు జరిగి మళ్లీ యూటర్న్ తీసుకున్నారని దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు పవార్. అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. కొందరు భాజపా నేతలు తనతో, తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారని తెలిపారు. ప్రధానితో మంచి సంబంధాలు ఉన్నందున అనుమతి తెలపాలని కోరారని.. కానీ మోదీని కలిసి తమ వైఖరిపై స్పష్టత నిచ్చినట్లు చెప్పారు.
ఫడణవీస్పై విమర్శలు..
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పవార్ భాజపా నేతలతో మంతనాలు జరిపారని ఫడణవీస్ పేర్కొనటాన్ని తప్పుబట్టారు పవార్. 'ఆయన స్థానం ఎక్కడ? జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఆయనకు ప్రాధాన్యం ఉందని నేను నమ్మటం లేదు' అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఆయన ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అధికారం కోల్పోవటం జీర్ణించుకోలేకపోతున్నారని... అది ఆయనకు మంచిది కాదని వ్యాఖ్యానించారు పవార్.
'మహా'లో ఆపరేషన్ కమల్ పనిచేయదు..
ఇతర రాష్ట్రాల తరహాలో ఆపరేషన్ కమల్ మహారాష్ట్రలో పని చేయదని పేర్కొన్నారు పవార్. ఠాక్రే ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుందని నొక్కిచెప్పారు. మహా వికాస్ అఘాడి ఆ తర్వాతి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మాట్లాడుకుందాం రండి: కాంగ్రెస్ బుజ్జగింపులు