నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు మరణశిక్ష అమలు ఖాయమైంది. దోషులు వినయ్ శర్మ, ముకేశ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వ్యాజ్యానికి ఎలాంటి విచారణ అర్హత లేదని స్పష్టంచేసింది. నలుగురికి ఉరిశిక్ష విధించాల్సిందేనని తేల్చిచెప్పింది.
దిల్లీ కోర్టు ఇటీవల జారీచేసిన డెత్ వారెంట్ మేరకు... నిర్భయ కేసు దోషులను ఈనెల 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైలులో ఉరి తీయనున్నారు. ఇందుకోసం జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఇదీ కేసు...
2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది. ఉరి శిక్ష అమలుకు వీలుగా ఈనెల 7న దిల్లీ పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు 'క్యురేటివ్ పిటిషన్' దోషులకు ఉన్న ఆఖరి అవకాశం. అయితే క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో నలుగురు కిరాతకులకు ఉరి అనివార్యమైంది.