భారత సైన్యం చరిత్రలోనే కార్గిల్ యుద్ధం ఓ మైలురాయి. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధమది. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని నిల్చొనేలా చేసింది. సరిహద్దు రేఖ వెంబడి జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌లో దాయాది పాక్‌తో 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 2 నెలల 23 రోజుల పాటు సాగి జులై 26తో ముగిసింది. అదే రోజు పాక్ అక్రమ చొరబాటుదారులను పూర్తిగా తరిమికొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. గొప్ప విజయానికి ప్రతీకగా ఏటా జులై 26న కార్గిల్ దివస్‌గా జరుపుకుంటాం. దీనినే 'ఆపరేషన్ విజయ్'గానూ పిలుచుకుంటారు.
కార్గిల్ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ భారత ప్రధానిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధాని. నియంత, మాజీ పీఎం పర్వేజ్ ముషారఫ్ అప్పటి పాక్ సైన్యాధిపతి.
ఇదీ చూడండి: దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం
యుద్ధానికి నాంది...
1971లో జరిగిన భారత్- పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో అవుట్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాయి. ఈ కారణంగా 1990 వరకు ఇరుదేశాల మధ్య పెద్దగా ఎలాంటి గొడవల్లేవు.
అనంతరం.. కాశ్మీర్‌లోని వేర్పాటువాదుల్ని ప్రోత్సహించడం ప్రారంభించింది పాకిస్థాన్. ఫలితంగా దాయాదుల మధ్య పాతగొడవలు రాజుకున్నాయి. 1998లో ఇరుదేశాలు అణుపరీక్షలు నిర్వహించాయి. 1999లో లాహోర్ ఒప్పందంపై భారత్- పాకిస్థాన్ సంతకాలు చేశాయి. కశ్మీర్ వివాదం విషయంలో ఇది శాంతికి బాటలు పరుస్తుందని అందరూ ఆశించారు.
ఇదీ చూడండి: అమర వీరుల జ్ఞాపకార్థం జవాన్ల రక్తదానం
అదను చూసి...
వివాదం సద్దుమణుగుతుందనుకుంటే జరిగింది ఇంకొకటి. 1998-99 సమయంలో పాక్ సైన్యం వద్ద శిక్షణ పొందిన కోవర్టుల గుంపులు భారత్‌లోకి ప్రవేశించాయి. అంతకుముందే హిమాలయాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా సైన్యాన్ని వెనక్కు రప్పించింది భారత్. సరిగ్గా అదే సమయంలో పాక్ సేనలు తీవ్రవాదుల సాయంతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. చాప కింద నీరులా పాకుతూ... క్రమంగా భారత్‌కు కీలక ప్రాంతాలైన బటాలిక్, ద్రాస్, టైగర్ హిల్ ప్రాంతాలకు విస్తరించాయి.
అమరులైన 523 మంది జవాన్లు...
పాక్ చర్యల్ని తిప్పికొట్టేందుకు భారత సైన్యం 2 లక్షల మంది సైనికులను సిద్ధం చేసింది. అప్పటి ప్రతికూల పరిస్థితుల కారణంగా 30 వేల మంది మాత్రమే యుద్ధంలో పాల్గొన్నారు. పలు కీలక ప్రాంతాల్లో తిష్ట వేసిన పాక్ దళాల్ని సమర్థంగా ఎదుర్కొన్న భారత సైన్యం టైగర్ హిల్ మీద భారత పతాకాన్ని ఎగరవేసింది.
కదనరంగంలో వీరోచితంగా పోరాడిన 523 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 13 వందల 63 మందికి గాయాలయ్యాయి. 4 వేల మంది వరకు పాక్ ఆక్రమణదారులు మృతి చెందగా.. 665 మంది గాయపడ్డారని అంచనా.
ఇదీ చూడండి: కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద రాజ్‌నాథ్ నివాళి
కార్గిల్‌తోనే పాఠాలు...
పాక్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ గెలిచినా సైన్యానికి ఎన్నో పాఠాలు నేర్పింది. యుద్ధసమయంలో సరైన సమాచార వ్యవస్థ లేనందున.. ఆర్మీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అధునాతన సమాచార వ్యవస్థ ఉన్న శత్రుమూకల వల్ల మొదట్లో మనం చాలా మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది.
తదనంతరం.. భారత సైన్యం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. కార్గిల్ యుద్ధానంతరం వ్యూహాలు, సమన్వయం వంటి విషయాల్లో ఎంతో పరిణతి సాధించింది సైన్యం. భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ప్రస్తుతం.. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వడమంటే పులి నోట్లో తలపెట్టడమని అభిప్రాయపడేలా చేసింది.
పొరుగు దేశాలపై, సరిహద్దు రేఖ వెంబడి నిరంతర నిఘా, పరిస్థితుల్ని వేగంగా అంచనా వేయడం, అన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడం, దురాక్రమణలను నిరోధించడం తదితర విషయాల్లో పూర్తిగా మెరుగయ్యాం. ఎంతో వ్యూహాత్మకంగా చొరబడ్డ పాక్ సేనల వల్లే భారత్ ఇంతటి జాగ్రత్తను పాటిస్తోంది. ఎప్పుడూ ఎముకలు గడ్డ కట్టుకుపోయే చలి ఉండే పర్వత ప్రాంతాల్లోనూ నిరంతర పహారాతో భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఇదీ చూడండి: కార్గిల్, బాలాకోట్‌పై ధనోవా చెప్పిన ఆసక్తికర విషయాలు
మారని పాక్...
కార్గిల్ విజయం భారత్ సొంతమని ప్రపంచమంతా అంగీకరిస్తుంటే పాకిస్థాన్ మాత్రం ఉలిపిరి కట్టె ధోరణిలో వ్యవహరిస్తోంది. ఈ దాడి వల్లే భారత్ చర్చలకు ముందుకొచ్చిందని మాజీ అధ్యక్షుడు ముషారఫ్ అప్పట్లో పేర్కొన్నారు. విజయం కూడా తమదేనని చెప్పుకొచ్చారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా... చిరస్మరణీయ కార్గిల్ యుద్ధవిజయాన్ని సాధించి 20ఏళ్లు అవుతోంది. ఈ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన పాక్.. ఇప్పటికీ భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కొత్త కొత్త తీవ్రవాద సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇదీ చూడండి: పుల్వామా ఘటనను ఖండించిన అమెరికా
మానని గాయం.. పుల్వామా ఘాతుకం
2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో జైషే మహ్మద్ చేసిన భీకర ఉగ్ర దాడిని దేశం ఇప్పట్లో మర్చిపోలేదు. జాతీయ రహదారిపై ఓ సీఆర్పీఎఫ్ వాహణశ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేసింది జైషే ఉగ్రసంస్థ. ఈ ఘటనలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు.
ఈ ఘటనానంతరం.. పాక్‌ను ముప్పుతిప్పలు పెట్టింది భారత్. ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుదాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది. ఇందులో వందల మంది తీవ్రవాదులు మరణించారని కొన్ని నివేదికలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: 'పుల్వామా' పాత్రధారుల్ని మట్టుబెట్టిన సైన్యం
అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. పాక్‌పై తీవ్ర ఒత్తిడి పెంచింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు గురయ్యేలా చేసి పాకిస్థాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. కరుడుగట్టిన ఉగ్రవాది జైషే అధినేత మసూద్ అజార్‌ను పుల్వామా దాడి అనంతరమే.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐరాస. ఇందుకు కారణం భారతే కావడం విశేషం.