జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలో దాదాపు 60 గంటలుగా కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. బాబాగంద్ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు తీవ్రవాదులు, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలం నుంచి ఉగ్రవాదుల ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర ఆధారాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎన్కౌంటర్ సమయంలో కొందరు స్థానిక యువకులు భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు. వారిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మరణించాడు.
ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉండి కాల్పులు కొనసాగిస్తున్నారు. భద్రతా సిబ్బంది చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముష్కరుల పనిబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.