కరోనా సంక్షోభంతో కొంతకాలంగా సింగపూర్లో చేరుకున్న 234 మంది భారతీయులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం... వీరందరితో ఈ మధ్యాహ్నం దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
బంగ్లాదేశ్ నుంచి మరొకటి...
బంగ్లాదేశ్ నుంచి మొదటి విడతలో భాగంగా 168 మందిని ప్రత్యేక విమానం ద్వారా తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక విమానం ఈ రోజు (శుక్రవారం) ఉదయం బయలు దేరినట్లు వెల్లడించారు. ఈ విమానం నేరుగా శ్రీనగర్లో ల్యాండ్ అవుతుందని తెలిపారు.
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మొత్తం ఏడు విమానాలను నడుపుతున్నట్లు ఆ దేశంలోని భారత హైకమిషన్ పేర్కొంది.
మాల్దీవుల నుంచి...
ఆపరేషన్ సముద్రసేతు కింద సముద్ర మార్గం ద్వారా మరికొంత మందిని తీసుకొస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా ఇప్పటికే మాల్దీవులకు చేరుకున్న ఐఎన్ఎస్ జలాశ్వ మరికొన్ని గంటల్లో భారత్కు బయలు దేరనుంది.