చైనాతో భారతదేశం రెండు యుద్ధాలు చేస్తోందని.. ఒకటి సరిహద్దులో కాగా, రెండోది ఆ దేశం నుంచి వ్యాపించిన కరోనా వైరస్ అని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్ కేసులు ఉద్ధృతమవుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా బారిన పడిన వారిలో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం సర్వసాధారణమైన లక్షణమన్నారు. అందువల్ల ఎవరికీ ఇబ్బందుల్లేకుండా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తెలిపే పల్స్ ఆక్సీమీటర్లను కరోనా రోగులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని తెలిపారు. శ్వాససంబంధమైన ఇబ్బందులకు గురికాకముందే హోం ఐసోలేషన్లో ఉండే కరోనా రోగులు వీటిని ఫోన్ చేసి తెప్పించుకోవాలని సూచించారు.
కరోనా పరీక్షలు మూడింతలు పెంచాం
దిల్లీలో కరోనా పరీక్షలను మూడింతలు చేశామనీ.. గతంలో రోజుకు 5000 పరీక్షలు చేస్తే.. ఇప్పుడు దాదాపు 18000 పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలు చేయించుకొనేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. కరోనా రోగులందరూ కొవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుందనీ.. ఇళ్లల్లో వసతులు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు లేనివారు హోం క్వారంటైన్‌లో ఉండేందుకు తాజాగా కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్లో ఉండే వారందరికీ పల్స్ ఆక్సీ మీటర్లు ఇస్తామనీ.. ప్రతి కొన్ని గంటల సమయానికి ఒకసారి ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చన్నారు. రోగులు కోలుకొన్నాక వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు.
డ్రాగన్‌ను ఐక్యతతో ఎదుర్కొందాం
ఈ సందర్భంగా భారత్- చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పైనా కేజ్రీవాల్ మాట్లాడారు. "చైనాతో భారత్ రెండు రకాలుగా యుద్ధం చేస్తోంది. ఒకటి సరిహద్దు వద్ద అయితే, రెండోది చైనా నుంచి వ్యాప్తి అయిన కరోనా మహమ్మారితో. ఈ రెండింటిపైనా మనమంతా ఐక్యంగా పోరాడాలి. దేన్నీ రాజకీయం చేయకూడదు. మన వీర సైనికులు వెనక్కి తగ్గలేదు.. మనం కూడా విజయం సాధించే దాకా వెనకడుగు వేయొద్దు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో దిల్లీ.. తమిళనాడును దాటి రెండో స్థానంలోకి వచ్చేసింది. దాదాపు 60వేల మార్క్‌కు సమీపంలో ఉంది. ఆదివారం ఒక్కరోజే 3 వేల పాజిటివ్ కేసులు రావడం వల్ల దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 59,746కి చేరింది. దిల్లీలో ఇప్పటివరకు 33వేల మందికి పైగా కోలుకోవడం వల్ల ప్రస్తుతం దాదాపు 25 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి:మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి