బిహార్, అసోం రాష్ట్రాల్లో నెలకొన్న వరద బీభత్సంలో మృతుల సంఖ్య 170కి చేరింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం కోటి 70 వేల మంది వరదల ప్రభావానికి గురయ్యారు. బిహార్లో 12 జిల్లాలు, అసోంలో 2 జిల్లాల్లో జలవిలయం కొనసాగుతోంది.
వరదల ధాటికి బిహార్లో 104 మంది చనిపోగా.. అసోంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్లో 76.85 లక్షలు, అసోంలో 30.55 లక్షల మంది వరదల ప్రభావానికి లోనయ్యారు. అసోంలోని కాజీరంగా జాతీయ పార్క్‌లో 187 మూగజీవాలు మృత్యువాత పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో 16 ఖడ్గమృగాలు ఉన్నాయి.
రెండు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 96,890 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 757 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,283 గ్రామాలు, 1.14 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి. ఎడతెగని వర్షాలకు తోడు ఎగువన ఉన్న నేపాల్ నుంచి వస్తున్న వరదల కారణంగా బిహార్లోని 12 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
ఇదీ చూడండి: చంద్రయాన్ నెహ్రూ చొరవ ఫలితమే: కాంగ్రెస్