కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయం పంపిణీకి ఉద్దేశించిన 15వ ఆర్థిక సంఘం నివేదిక సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం అక్టోబర్ 30వ తేదీ నాటికి నివేదిక అందివ్వాల్సిన నేపథ్యంలో ఆర్థిక సంఘం శుక్రవారం నాటికి తన పని పూర్తి చేసి విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయానికి చేరవేసింది. 2021-26 మధ్య అయిదేళ్ల కాలానికి ఆర్థిక వనరుల పంపిణీ కోసం సిద్ధ చేసిన నివేదికను కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దానిపై ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్‌తో పాటు, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేష్ చంద్‌లు సంతకాలు చేశారు. దీన్ని రాష్ట్రపతికి సమర్పిచడానికి సమయం కోరగా, వచ్చేనెల 9వ తేదీన అందుకు అవకాశమిచ్చారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో..
ఆర్థిక సంఘం వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి బహుశా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదికను పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున చర్యా నివేదికనూ పార్లమెంటుకు సమర్పించనున్నారు. వాస్తవంగా 15వ ఆర్థిక సంఘం 2020-25 సంవత్సరాలకు సిఫార్సలు చేయాల్సి ఉంది. అయితే మధ్యలో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి నిధుల కేటాయింపుపై అధ్యయనం చేయాలని కోరుతూ ఆర్థిక సంఘానికి నిర్దేశించిన విధివిధానాల్లో కొత్త అంశాన్ని జోడించింది.
రెవిన్యూ లోటు గ్రాంట్లలో మార్పులు
ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఇటీవల వివిధ ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులు కుంచించుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రాలకు ప్రకటించే రెవిన్యూ లోటు గ్రాంట్‌ను తిరిగి లెక్కించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక నివేదికలో సిఫార్సు చేసిన రెవిన్యూ లోటు గ్రాంట్లలో మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రక్షణరంగం ఆధునీకరణ కోసం మురిగిపోవడానికి వీల్లేని విధంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ప్రజావైద్యం కోసం..
కొవిడ్ మహమ్మారి కారణంగా దేశ వైద్య వ్యవస్థలోని లోపాలు బయటపడిన నేపథ్యంలో ప్రజావైద్య ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పన్నుల్లో 50% వాటా కోసం డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం ఇప్పుడు ఉన్న కేటాయింపులను తగ్గించాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరింది. విద్య వైద్యరంగాలపై ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉన్నందున కేంద్రం చేతులోలో ఎక్కువ నిధులు మిగిలేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయించే పన్ను వాటా ప్రయోజిత పథకాలను హేతబద్ధీకరిస్తూ సిఫార్సు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'