దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో గత 24 గంటల్లో మొత్తం 552 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,200 కేసులు నమోదయ్యాయి. 211 మంది ప్రాణాలు కోల్పోయారు. 507మంది కోలుకున్నారు. ముంబయిలోని జాస్లోక్ ఆస్పత్రిలో 17 మంది నర్సులు, 5గురు వైద్యులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
గుజరాత్‌లో...
గుజరాత్‌లోనూ కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. గుజరాత్‌లో ఇవాళ మరో 228 కేసులు నమోదు కాగా.. మొత్తంగా కేసుల సంఖ్య 1,743కు చేరింది. మరో 10 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 68 కి పెరిగింది. 94 మంది కోలుకున్నారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో ఇవాళ 140 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా, నలుగురు మరణించారు. మొత్తంగా అహ్మదాబాద్‌లో వైరస్ బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. గుజరాత్‌లో తొలి పాజిటివ్ కేసుగా తేలిన నయోమీ షా.. కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
దిల్లీలో...
దేశ రాజధాని దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా బారిన పడగా హస్తినలో మొత్తం బాధితుల సంఖ్య 1,893కు చేరింది. 43 మంది మరణించగా 72మందికి వ్యాధి నయమైంది. దిల్లీలో ఇప్పటికైతే... లాక్‌డౌన్ ఆంక్షలు సడలించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
కర్ణాటకలో...
కర్ణాటకలో మరో 4 కేసులు నమోదుకాగా, వీరిలో ఇద్దరు దిల్లీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నాలుగు కేసులు మైసూరు క్లస్టర్‌లోనే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 388కి పెరిగింది. ఇప్పటివరకు 14 మంది మరణించారు. 104 మంది కోలుకున్నారు.
రాజస్థాన్‌లో..
రాజస్థాన్‌లో మరో 80 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో కేసుల సంఖ్య 1,431 కు చేరింది. మృతుల సంఖ్య 23కి పెరిగింది. 205 మంది కోలుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మరో 110 మందికి కరోనానిర్ధరణ కాగా... మొత్తంగా వెయ్యి 84 మందికి కరోనా సోకింది. మరో ముగ్గురు మరణించారు. ఫలితంగా.. ఇప్పటివరకు యూపీలో 17 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 108 మంది కోలుకున్నారు.
తమినాడులో..
తమిళనాడులో మరో 105 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 1,477కు చేరాయి. 15 మంది మరణించారు. తమిళనాడులో ఇద్దరు పాత్రికేయులకు వైరస్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఇతర రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే..
మధ్యప్రదేశ్‌లో కేసులసంఖ్య 1,407కు చేరగా... 72 మంది చనిపోయారు. మరో 131మంది కోలుకున్నారు. జార్ఖండ్‌లో మరో 4 గురికి వైరస్ సోకగా.. మొత్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 38కు పెరిగింది. బిహార్‌లో మరో ముగ్గురికి వైరస్ సోకగా.. మొత్తంగా వైరస్ బారిన వారి సంఖ్య 92కు పెరిగింది. జమ్ముకశ్మీర్‌లో మరో 9మంది వైరస్ సోకింది.