కర్ణాటకలో జలవిలయానికి వందలాది గ్రామాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బెళగావి జిల్లాలో వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేసి పరిస్థితిని పరిశీలించారు. కేంద్రం అన్ని విధాల రాష్ట్రానికి సాయం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
కొన్ని చోట్ల వరద ఉద్ధృతి కాస్త తగ్గినా ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు అలాగే నిలిచి ఉంది. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు. బెళగావి జిల్లాలోని రోగ్గి, హలోలి, ఉదగట్టి, గిర్దల్ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సైన్యం కాపాడింది.
అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సాయమందిస్తున్నారు. 1,24,291 మందిని జాతీయ విపత్తు స్పందన దళం.. సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు.
బెళగావిలో...
బెళగావి జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జిల్లాలో వరదల ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,410 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 4,019 ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి.
మిగిలిన జిల్లాల్లోనూ...
బాగల్‌కోట్, విజయపుర, రాయ్‌చూర్, యాద్‌గిరి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, శివమొగ్గ, కొడగు, చిక్కమగళూర్ జిల్లాల్లోనూ జల విలయం కొనసాగుతోంది.
- ఇదీ చూడండి: వరద గుప్పిట్లో కేరళ.. 22కు చేరిన మృతులు