కశ్మీరులో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 12 మంది మృతి చెందారు. కశ్మీర్ రామ్బన్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. డ్రైవర్ సహా మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శనివారం ఉదయం ఛాదర్కోటె నుంచి రాజ్గార్ ప్రయాణిస్తోన్న ఎస్యూవీ వాహనం కుందా నల్హా సమీపంలో అదుపు తప్పి 500 అడుగుల లోయలో పడిపోయింది. ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఘటన జరిగిన వెంటనే స్ధానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. లోయలో నుంచి ఐదు మృతదేహాలను బయటికి తీశారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ ద్వారా సమీప అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మరో రెండు ప్రమాదాలు
కశ్మీర్ పూంఛ్ జిల్లా ఝలాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ సైక్లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
సాంబ జిల్లా జమ్మూ-పఠాన్కోట్ జాతీయ రహదారిపై బస్సు, మినీ వాహనం ఢీకొన్న ఘటనలో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రును ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.