భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లాకు 'వై' కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి చేస్తోంది. టీకాలకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఆయనకు వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరు లేదా ముగ్గురు కమాండోలు ఆయన వెన్నంటే ఉంటారు. ఇప్పటికే కృష్ణ ఎల్లాకు సీఐఎస్ఎఫ్ భద్రత కొనసాగుతోంది.
52 ఏళ్ల కృష్ణ ఎల్ల.. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్‌ను స్థాపించారు. కరోనా టీకాతో పాటు ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సహా పలు ఇతర టీకాలను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్‌కు ఇటీవలే సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించింది కేంద్రం.
ఇదీ చూడండి: డాక్టర్ కృష్ణ ఎల్లకు 'ఫోర్బ్స్' అరుదైన గౌరవం