బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ ఆసక్తికర నినాదాన్ని ఎంచుకుంది. సీఎం మమతా బెనర్జీని బంగాల్ ముద్దుబిడ్డగా పేర్కొంటూ.. 'బంగ్లా నిజర్ మెయెకై చాయే' పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. 'బంగాల్‌కు కావాల్సింది సొంత కూతురే' అని దీనర్థం.
టీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద దీదీ ఫొటోలతో పాటు నినాదాలు కూడిన హోర్డింగులను ఏర్పాటు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజధాని కోల్‌కతా వ్యాప్తంగానూ వీటిని నెలకొల్పుతున్నారు.
"ముఖ్యమంత్రిగా గత కొన్నేళ్ల నుంచి తమ వెంటే మమతను బంగాల్ ప్రజలు కోరుకుంటున్నారు. తమ సొంత బిడ్డనే వారు కావాలని అనుకుంటున్నారు. బంగాల్లో ఇతర వ్యక్తుల ఆధిపత్యాన్ని మేం కోరుకోవట్లేదు."
-పార్థా చటర్జీ, టీఎంసీ ప్రధాన కార్యదర్శి
దీదీ, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో ఇప్పటికే బంగాల్లో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. భాజపా నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు దీదీ. మమత పాలనకు చరమగీతం పాడాలని భాజపా ప్రచారం చేస్తోంది.
భారీగా కేంద్ర బలగాలు
మరోవైపు, ఎన్నికలకు సిద్ధమవుతున్న బంగాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. 12 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది(సీఏపీఎఫ్) బలగాలను రాష్ట్రానికి పంపించారు. డాన్కునీకి ఐదు కంపెనీలు, కోల్‌కతాకు నాలుగు కంపెనీలు, దుర్గాపుర్‌కు రెండు కంపెనీల దళాలు చేరుకున్నాయని తెలిపారు. బుర్ద్వాన్‌కు ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ సిబ్బంది చేరుకున్నారని చెప్పారు.
ఫిబ్రవరి 25 నాటికి 125 కంపెనీల కేంద్ర బలగాలను బంగాల్లో మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. 60 కంపెనీల సీఆర్పీఎఫ్, 30 కంపెనీల సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ), ఐదు కంపెనీల చొప్పున సీఐఎస్ఎఫ్, ఇండోటిబెటన్ సరిహద్దు పోలీసుల బృందాలు మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్' పైనే!