బంగాల్ అసెంబ్లీ నాలుగో దశ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. భద్రత కోసం 789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ.. దాడులు, ప్రతిదాడులు, ఘర్షణలతో పలు ప్రాంతాలు అట్టుడికాయి. అదే సమయంలో పోలింగ్‌కు భారీగా తరలివచ్చారు ఓటర్లు. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదైంది.
నలుగురు మృతి
పోలింగ్ సందర్భంగా కూచ్‌బిహార్ జిల్లా సితాల్‌కుచి రణరంగమైంది. జోర్‌పట్కీ ప్రాంతంలో ఓటర్లను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా.. భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. ఇరువర్గాలకు మధ్య ఘర్షణలు తలెత్తి అవి కాల్పులకు దారి తీశాయి. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు కేంద్ర పారిశ్రామిక దళం(సీఐఎస్ఎఫ్) జరిపిన కాల్పుల్లో.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేళ బలగాల కాల్పులు - నలుగురు మృతి
కాల్పుల ఘటనతో సితాల్‌కుచిలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాల్పులు జరపడానికి దారి తీసిన పరిస్థితులపై.. అధికార వర్గాలు వివరణ ఇచ్చాయి.
"సితాల్‌కుచిలోని 126వ పోలింగ్ కేంద్రం వద్ద 50 నుంచి 60 మందితో కూడిన ఓ బృందం.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఓటర్లను అడ్డుకున్నారు. తర్వాత కొందరు దుండగులు.. సీఐఎస్ఎఫ్ తక్షణ స్పందన దళానికి చెందిన వాహనంపై దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం తక్షణ స్పందన దళం.. గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాయి. గంట తర్వాత 150 మందితో ఉన్న ఓ గుంపు సితాల్‌కుచి సమీపంలోని మరో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పోలింగ్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఆపేందుకు ప్రయత్నించిన తమ ఉద్యోగి వద్ద నుంచి.. ఆయుధాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు ఉద్రేకంగా మారడం వల్ల గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల ఆత్మరక్షణ కోసం ఆందోళనకారులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు చేశారు."
-అధికారులు
ఈ పరిస్థితులపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఘర్షణ జరిగిన సితాల్‌కుచిలోని 126వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలను వాయిదా వేసింది. ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది.
మాటల యుద్ధం!
కాగా ఈ ఘటనపై భాజపా, టీఎంసీల మధ్య మాటల యుద్ధం సాగింది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఓడిపోతామని తెలిసి భాజపా ప్రజలను భయపెడుతోందని.. ఈ కుట్రలో అమిత్‌షాకు కూడా భాగం ఉందని ఆరోపించారు.
మరోవైపు, ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా బంగాల్‌లో భాజపా విజయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
ఒకరి హత్య
సీఐఎస్ఎఫ్ కాల్పుల ఘటనకు ముందు.. సితాల్‌కుచిలోనే 85వ నెంబర్ పోలింగ్ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆనంద బర్మన్ అనే 18ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తృణమూల్, భాజపా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. హత్య వెనుక భాజపా ఉందని తృణమూల్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా.. మృతి చెందిన యువకుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేతలే కాల్పులు జరిపారని దుయ్యబట్టింది.
బంగాల్‌లోని పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ఘర్షణల మధ్య కొనసాగాయి. హూగ్లీలో భాజపా నేత లాకెట్ ఛటర్జీ కారును ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. పలు మీడియా వాహనాలు కూడా ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి.
ఇదీ చదవండి: ప్రశాంత్ కిశోర్ నోట భాజపా అనుకూల మాట!