బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై భాజపా విమర్శల దాడి పెంచింది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధివైపు ఉంటారో.. లేక కమీషన్ల ప్రభుత్వంవైపు నిలుస్తారో తేల్చుకోవాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.
పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి 'లోకో సోనార్ బంగ్లా( బంగారు బంగాల్ సాధించటమే లక్ష్యం)' అనే కార్యక్రమాన్ని కోల్‌కతాలో ప్రారంభించిన నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్లో జన్మించిన ప్రముఖులను, మహిళలను మమత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ మేనిఫెస్టోలో మటువా వర్గం, మహిళలు, యువతకు పెద్ద పీట వేసి.. వారి సామాజిక, ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని తెలిపారు. కట్ మనీ, సిండికేట్ల సంస్కృతిని అంతం చేస్తామని పేర్కొన్నారు.
'లోకో సోనార్ బంగ్లా' ద్వారా ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తామని అన్నారు నడ్డా. ఈ కార్యక్రమం మార్చి 3వ తేదీన మొదలై.. అదే నెల 30 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
"ప్రజల నుంచి సలహాలు స్వీకరించేందుకు బంగాల్ వ్యాప్తంగా 30,000 పైగా సలహా పెట్టెలను ఏర్పాటు చేస్తాం. ప్రజలు డిజిటల్ వేదికగా కూడా వారి సలహాలు అందించవచ్చు. ఇందులో ప్రజల భాగస్వామ్యం అవసరం. అవినీతిని, సిండికేట్ వ్యవస్థను, బొగ్గు అక్రమ రవాణాను, కట్ మనీ సంస్కృతిని అంతం చేసే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బంగాల్‌కు ఉన్న విస్తృత అవకాశాలను ప్రభుత్వాలను ఉపయోగించుకోలేకపోయాయి. వాటిని భాజపా తిరిగి తీసుకురావాలని కోరుకుంటోంది."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
పార్టీ అధికారంలోకి వస్తే ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండడం వల్ల రాష్ట్రాభివృద్ధి మరింత సులభం అవుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'లోఖో సోనార్ బంగ్లా' ప్రచారానికి నడ్డా శ్రీకారం