బంగాల్‌లో నాలుగో దఫా శాసనసభ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఏప్రిల్ 10న పోలింగ్ జరగనుంది. హావ్‌డా, దక్షిణ 24 పరగణ, హూగ్లీ, అలిపుర్ద్వార్, కూచ్‌బెహార్‌లోని 44 స్థానాల్లో 373 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు ఓటర్లు. ఆయా ప్రాంతాల్లోని సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రముఖులు..
బంగాల్ రంజీ కెప్టెన్ మనోజ్ తివారీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, రాష్ట్ర క్రీడామంత్రి అరుప్ బిశ్వాస్, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో నాలుగో దశ బరిలో ఉన్నారు. ఇటీవల భాజపాలో చేరిన అటవీ శాఖ మంత్రి రాజీబ్ బెనర్జీ, ఎంపీ, నటి లాకెట్ ఛటర్జీ కూడా పోటీలో ఉన్నారు.
రంజుగా ప్రచారం..
మమత సర్కారుపై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా ఆమెవి బుజ్జగింపు రాజకీయాలని ప్రచారంలో తీవ్ర విమర్శలు చేసింది. మమత ఆట కట్టిస్తామని పేర్కొంది. అయితే చమురు ధరల పెంపు, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వంటివాటిని లక్ష్యంగా చేసుకొని కేంద్రంపై ధ్వజమెత్తారు మమత.
మొత్తం 294 సీట్లు గల రాష్ట్రంలో ఇప్పటివరకు 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. బంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: బంగాల్‌లో ముగ్గురు ఎన్నికల అధికారుల బదిలీ