బంగాల్ దంగల్‌లో దీదీ వర్సెస్ సువేందు పోరు దాదాపు ఖరారైనట్లే. ఈ మేరకు ఎన్నికల కోసం 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారని భావించినప్పటికీ తాను కేవలం నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించి ఆసక్తికర పోరుకు తెరతీశారు దీదీ.
ఇదీ చూడండి: నందిగ్రామ్ నుంచే దీదీ పోటీ- 291 సీట్లకు అభ్యర్థులు ఖరారు
''నేను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నా. మార్చి 9న అక్కడికి వెళ్తా. మరుసటి రోజు హల్దియాలో నామినేషన్ దాఖలు చేస్తా. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా.. కేంద్ర బలగాలను ఎంతమందినైనా పంపించుకోండి. విజయం మాత్రం తృణమూల్ కాంగ్రెస్‌దే.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
సువేందు రె'ఢీ'?
గతేడాది డిసెంబర్లో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరిన మమత అనుచరుడు, నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి.. మళ్లీ అదే చోట బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. గురువారం సమావేశమైన భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ.. సువేందుకు అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలపడమే తరువాయి. కీలక సమరానికి రంగం సిద్ధమైనట్లే.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: నందిగ్రామ్‌లో మళ్లీ ఆనాటి రక్తపాతం!
ఈ పరిస్థితుల్లో దీదీ వర్సెస్ సువేందుగా మారిన బంగాల్ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.. అంతిమ విజయం ఎవరిదో ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: ఆ 109 సీట్లపై భాజపా గురి!
అప్పుడే పోటీపై ప్రకటన..
సువేందు కుటుంబానికి నందిగ్రామ్, జంగల్‌మహల్ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దీంతో ఆయన పార్టీ మారాక ఈ ప్రాంతంలో తృణమూల్ బలం కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య నందిగ్రామ్‌లో పర్యటించిన దీదీ.. వచ్చే ఎన్నికల్లో తాను ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి భాజపాకు సవాల్ విసిరారు.
ఇదీ చూడండి: సువేందుపై మమత గురి- నందిగ్రామ్ నుంచి పోటీ
కంచుకోటలో దీదీకే సవాల్..
సీఎం సవాల్‌ను స్వీకరించిన సువేందు కూడా.. దీదీపై పోటీ చేసి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని అదే రోజు ప్రకటించారు. మమతపై గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శపథం చేశారు. ధైర్యముంటే భవానీపూర్ కాకుండా ఒక్క నందిగ్రామ్ నుంచే పోటీ చేయండంటూ దీదీకి ప్రతి సవాల్ విసిరారు. నందిగ్రామ్‌లో గెలుపుపై తాను ధీమాగా ఉన్నానని సువేందు హైకమాండ్‌కు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
ఇదీ చూడండి: బంగాల్ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?
సువేందు అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడితే.. బంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ పోరు ఉత్కంఠగా మారుతుంది. పదేళ్ల క్రితం రాష్ట్రంలో అధికారం లెఫ్ట్ పార్టీల నుంచి తృణమూల్ చేతికి రావడంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్ ప్రాంతాన్ని తృణమూల్ వైపు తిప్పడంలో అధికారి కుటుంబానిదే కీలక పాత్ర.
ఇప్పుడు మమత పాలనకు తెరదించి.. భాజపాను గద్దెనెక్కించాలని చూస్తున్నారు.
తూర్పు మిడ్నాపూర్ జిల్లాకు చెందిన అధికారి.. ముర్షిదాబాద్, మాల్దా, పురూలియా, బంకురాలో రాజకీయంగా అధిక ప్రభావం చూపగలిగిన నాయకుడు. ఈ జిల్లాల్లోనే తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి పునాదులు ఏర్పడేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విశేషంగా పనిచేశారు. జంగల్ మహల్ ప్రాంతంలో దాదాపు 40కి పైగా స్థానాల్లో (మొత్తం అసెంబ్లీ స్థానాలు 294) సువేందు కుటుంబానికి మంచి పట్టుంది.
తప్పనిసరి..
ఈ పరిస్థితుల్లో నందిగ్రామ్ నుంచే పోటీ చేసి తన గెలుపును నిరూపించుకోవాల్సిన అవసరం సువేందుకు ఏర్పడింది. 'ఇక్కడి గడ్డపైనే పుట్టి పెరిగాను' అని తనను తాను స్థానిక వ్యక్తిగా ఆయన అభివర్ణించుకుంటారు. కాబట్టి, ఇక్కడ విజయం సాధించడం ద్వారా ప్రజలు తన పట్ల విశ్వాసంగానే ఉన్నారని తెలియజెప్పే అవకాశం ఉంటుంది.
సొంత నియోజకవర్గంలో..
మమత ఒకే స్థానంలో పోటీకి దిగాలని నిర్ణయించిన నేపథ్యంలో.. సొంత నియోజకవర్గం భవానీపూర్‌లోనూ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమె భుజస్కంధాలపై ఉంది.
తృణమూల్ నుంచి ఈ స్థానంలో.. సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేయనున్నారు.
అయితే.. మమత భవానీపూర్‌లోనూ పోటీ చేస్తే తాను అక్కడ బరిలోకి దిగుతానని ప్రకటించారు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. కానీ.. ఇప్పుడు అందుకు అవకాశం లేదు. మమత కేవలం నందిగ్రామ్‌కే పరిమితమయ్యారు. ఇక్కడ భాజపా అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది.
ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..
ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు తృణమూల్‌ను వీడి భాజపాలో చేరిన తరుణంలో మమత అప్రమత్తమయ్యారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చారు.
8 విడతల్లో..
బంగాల్‌లో 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి దశ ఎన్నికలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 29న చివరి విడత పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితం వెలువడనుంది.
ఇవీ చూడండి: బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం