దేశీయ పానీయాలకు పేరు గాంచిన ప్రదేశం త్రిపుర. బియ్యంతో తయారు చేసే 'రైస్ బీర్' ఇక్కడ ఎంతో ఫేమస్. తాజాగా అదే కోవలో.. ఈ ప్రాంతానికే చెందిన సమీర్ జమాతియా అనే ఓ వెదురు సాంకేతిక నిపుణుడు.. సరికొత్త బీర్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. అదే వెదురు తయారు చేసిన బీర్. దీనికి 'బాంబూ బీర్' అని పేరు పెట్టారాయన.
చైనాలో నేర్చుకుని..
చైనాలో చాలా కాలం పాటు ఉన్న సమీర్.. అక్కడ వెదురు సాంకేతికత గురించి చదువుకున్నారు. తక్కువ ధరకే ఆరోగ్య విలువలు ఉన్న వెదురు బీర్‌ను తయారు చేసిన ఆయన.. తమ రాష్ట్రానికే ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టారు. తన బీర్‌కు మంచి ఆదరణ దొరికితే.. స్థానిక బేవరేజ్ వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పారు.
జపాన్, చైనాలో ప్రాచుర్యం పొందిన వెదురు ఆకుల టీని భారత్‌లో తయారు చేసి విశేషాదరణ పొందారు సమీర్. దాన్ని ఆయన వివిధ రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేశారు. ఇప్పుడు ఈ వెదురు బీర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. "నా పానీయానికి ల్యాబ్ టెస్టు ధ్రువీకరణ పత్రం వస్తే... నేను భారీ స్థాయిలో ఈ వెదురు బీర్‌ను ఉత్పత్తి చేస్తాను. ట్రేడ్‌మార్క్ కోసం ఎదురు చూస్తున్నాను. అది త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను." అని 'ఈటీవీ భారత్'తో జమాతియా చెప్పారు.
ఎలా తయారు చేస్తారంటే..?
ఆహార ధాన్యాల ద్రావణం ఉపయోగించి ఈ బీర్‌ను తయారు చేస్తానని ఆయన చెప్పారు. అనంతరం దాన్ని వెదురు పొడిలో పులియబెడతానని తెలిపారు. వెదురులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. ఈ బీర్ ధర రూ.60 నుంచి రూ.70 మధ్య ఉంటుందని జమాతియా చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బీర్ ధరల్లో ఇది సగమేనని పేర్కొన్నారు. మార్కెట్లో దీనికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నానన్నారు.
ఇదీ చూడండి: బెదరని వనిత.. కింగ్ కోబ్రాను చేతపట్టి..
ఇదీ చూడండి: 'టీకా కేంద్రం'లో పుట్టినరోజు వేడుకలు