Minor Gang Rape: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మార్కెట్‌కు కూరగాయలు కొనుక్కునేందుకు వెళ్లిన ఓ మైనర్‌ను కిడ్నాప్ చేసి.. ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ధోల్‌పుర్ జిల్లాలో బారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జులై 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లింది. అదే సమయంలో ఓ యువకుడు.. తన బైక్‌పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలిక కుటుంబసభ్యులు తమ కుమార్తె కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు ఉదయం ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఫిర్యాదు..
హరియాణాలోని పానీపత్కు చెందిన ఓ వివాహిత.. తన అత్తమామలు, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్న నాటి నుంచి తనను తీవ్రంగా వేధిసున్నారని ఆరోపించింది. ఆడపిల్ల పుట్టిన తర్వాత మరింతగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పానీపత్కు చెందిన చాందిని.. బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 2017 డిసెంబర్ 7న దివ్యాంశ్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. ఆ సమయంలోనే కట్నకానుకల కింద.. చాందిని తల్లిదండ్రులు రూ.50 లక్షలు ఇచ్చారు. పెళ్లి అయిన 20 రోజులకే అదనపు కట్నం కోసం వేధించేవారు. బాధితురాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ తరచుగా ఫోన్ చెక్ చేసేవారు. పెళ్లైన ఒక నెలకే ఇంకా గర్భం దాల్చలేదా అంటూ దుర్భాషలాడేవారు. ఆ తర్వాత కొన్ని నెలలకు బాధితురాలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
బాధితురాలు బాలింతగా ఉన్న సమయంలోనే అత్తమామలు కారు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాందిని తండ్రి అందుకు నిరాకరించాడు. వెంటనే బాధితురాలి భర్త.. ఆమె కాళ్లను గట్టిగా తొక్కి నరకం చూపించాడు. ఆడబిడ్డ పుట్టిన కొన్ని నెలలకు బాధితురాలు.. అత్తవారింటికి వచ్చింది. ఆ సమయంలో చాందినిని ఇంటిలోపలికి కూడా అనుమతించలేదు. కానీ బాధితురాలు తెచ్చిన బట్టలు, పిండివంటలు, బంగారు ఆభరణాలను మాత్రం బలవంతంగా తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద.. చాందిని అత్తమామలు, భర్తపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: ఆ సిటీలో ఒకే రోజు ఐదుగురు సూసైడ్.. అసలేం జరిగింది?
మరో యువకుడు దారుణ హత్య.. సీఎం పరామర్శకు వెళ్లి వస్తున్నప్పుడే..