'న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకు కీలకపాత్ర ఉంది. న్యాయ వ్యవస్థ పనితీరుపై ప్రభావంచూపేలా ఏవైనా దాడులు జరిగితే వాటి నుంచి రక్షణ కల్పించాల్సింది వారే' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ పదవీ విరమణ సందర్భంగా వివిధ బార్ అసోసియేషన్లు కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'మనుషుల భావనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. సమావేశాలు, వీడ్కోలు కార్యక్రమాల్లో అవి మరింత ప్రకాశిస్తాయన్నది జర్మన్ నానుడి. విలువైన సహచరుడు అశోక్‌భూషణ్‌కి వీడ్కోలు పలుకుతున్నాం. ఒక గొప్ప సహచరుడిని, ఆయన విలువైన సాంగత్యాన్ని కోల్పోతున్నందుకు బాధగా ఉంది' అని జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు.
జస్టిస్ అశోక్ భూషణ్ గొప్ప న్యాయమూర్తిగానే కాకుండా, అత్యుత్తమ వ్యక్తిగా ప్రత్యేకత సంతరించుకున్నారని పేర్కొన్నారు. ఆయన బార్, బెంచ్ రెండింటినీ సమానంగా గౌరవించినట్లు తెలిపారు.
'కేసులపై నిర్ణయాలను తీసుకోవడంలో న్యాయమూర్తుల తత్వంతో పాటు న్యాయవాదుల పాత్రా కీలకంగా ఉంటుంది. న్యాయస్థానం, న్యాయవాదుల మధ్య సంబంధం సముద్రం, మేఘం లాంటిదని జస్టిస్ అశోక్‌భూషణ్ చెప్పారు. న్యాయ వ్యవస్థను సంరక్షించేది న్యాయవాదులే. ఉద్దేశపూర్వకంగా చేసే దాడుల నుంచి వ్యవస్థను కాపాడటంలో సుప్రీంకోర్టు న్యాయవాదులు ముందువరుసలో ఉన్న విషయం నాకు తెలుసు. వ్యవస్థ బలోపేతానికి మీ సహకారం, మద్దతు కోరుతున్నా. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సరైన అవగాహన నెలకొంటే సమస్యల పరిష్కారంలో సాయపడుతుంది. ఐకమత్యంలోనే బలం ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.'
-జస్టిస్ ఎన్‌వీ రమణ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇదీ చూడండి: మోదీ గడ్డంపై థరూర్ 'ఇంగ్లీష్' సెటైర్!