బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న వ్యక్తి వలపు వలలో పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఆ యువతి ఉచ్చులో పడి భారీ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ కస్టమర్ ఖాతా నుంచి అక్రమంగా రూ.6 కోట్లు రుణం తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేయడం వల్ల బ్యాంకు మేనేజర్ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్ ఇండియన్ బ్యాంకు హనుమంతనగర్ శాఖలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల కిందట ఓ డేటింగ్ యాప్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి అతడికి పరిచయమైంది. రోజూ మెసేజ్ చేస్తూ అతడిని ఆకట్టుకుంది. ఓ రోజు డబ్బులు కావాలంటూ అడగగా.. రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరింది. బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా రూ. 6 కోట్లు రుణాన్ని తీసి యువతి ఖాతాలో వేశాడు హరిశంకర్.
అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకుని.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది. అయితే, హరిశంకర్ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతికి ఇచ్చాడు.
మే 13న అనితకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా నుంచి రుణం ఇవ్వగా.. మే 19న అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిశంకర్ సహా అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. హరిశంకర్‌ను బుధవారం కోర్టులో హజరుపర్చగా.. 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
ఇదీ చదవండి: కొండ చిలువ గుడ్లను పొదిగించిన పాము సంరక్షకులు.. 8 పిల్లలను అడవిలో..