మాస్కు ధరించకుండా బ్యాంకు లోపలికి వెళ్లేందుకు ఓ వినియోగదారుడు యత్నించగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు రెచ్చిపోయాడు. అతనిపై తుపాకీ గురిపెట్టి కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలోని స్టేషన్ రోడ్డులో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ వద్ద శుక్రవారం జరిగింది.
అసలేం జరిగిందంటే..
రాజేశ్ కుమార్ అనే వినియోగదారుడు.. ఉదయం 11:30 గంటలకు బ్యాంకులో ఏదో పని కోసం మాస్కు లేకుండా వచ్చాడు. ఈ క్రమంలో అతడికి, సెక్యూరిటీ గార్డ్ కేశవ్ ప్రసాద్ మిశ్రాకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కేశవ్ ప్రసాద్.. రాజేశ్ కుమార్‌పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ కుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అతనికి ఎలాంటి ప్రాణహాని లేదని వెల్లడించారు. సదరు సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
'నన్ను తిట్టాడు..'
మాస్కు లేకుండా ప్రవేశించటమే కాకుండా రాజేశ్ కుమార్ తనను దూషించాడని.. పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు సెక్యూరిటీ గార్డు పదేపదే చెప్పాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించినందునే తాను కాల్పులు జరిపానని చెప్పినట్లు పేర్కొన్నారు.
కోలుకున్న తర్వాత..
ఈ కాల్పులు సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం దీనిపై దర్యాప్తు చేప్టటింది. అయితే.. కోలుకున్న తర్వాత సదరు వినియోగదారుడిని వాంగ్మూలాన్ని తీసుకుంటామని ఎస్పీ రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తోందని బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ తెలిపారు. ఈ దృశ్యాలను పరిశీలించాకే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.
ఆదుకుంటాం..
ఈ దురుదృష్టకర ఘటనపై తాము చింతిస్తున్నామని బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డ వ్యక్తి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపింది. ఈ ఘటనపై తాము కూడా అంతర్గతంగా దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. ఇలాంటి ఘటనలో భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇదీ చూడండి: ఇంట్లోనే ఎలుకల పెంపకం- సూపర్ ఆదాయం!
ఇదీ చూడండి: 'గోల్డెన్ బాబా' బంగారు మాస్క్- ధరెంతంటే..?