బంగాల్ అసెంబ్లీ బరిలో ఉన్న భాజపా నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో... కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన వివాదానికి దారి తీసింది. కెమెరాల ముందు మాట్లాడటం ఆపి ప్రచారంపై దృష్టిసారించాలని ఆ యువకుడు పదేపదే చెబుతుండగా.. అతని చెంపపై కొట్టారు సుప్రియో.
టాలీగంజ్ నియోజకవర్గం.. రాణికుతిలోని పార్టీ కార్యాలయంలో హోలీ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి సుప్రియో హాజరయ్యారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది.
అయితే, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు సుప్రియో. యువకుడిపై చేయి చేసుకోలేదని చెప్పారు. అతన్ని కొట్టినట్టు సంజ్ఞ చేశానని అన్నారు. ఆ వ్యక్తి తనను రెచ్చగొట్టాడని, అయినప్పటికీ తాను శాంతంగా ఉన్నానని తెలిపారు.
"ఇతర పార్టీల నుంచి వచ్చే వారిలో కొందరు విభీషణులు ఉంటే మరికొందరు మీర్ జాఫర్లు(విద్రోహి అర్థం వచ్చేలా) ఉంటారు. కచ్చితంగా కొంత మంది గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను రెచ్చగొట్టినప్పటికీ.. నేను శాంతంగానే ఉన్నా."
-బాబుల్ సుప్రియో, భాజపా నేత
అయితే, ఆ వ్యక్తిని సొంత పార్టీ కార్యకర్తగా భావించారా, లేదా టీఎంసీ పంపిన వ్యక్తి అనుకున్నారా అనే విషయంపై సుప్రియో స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు, సుప్రియో వివరణను తప్పుబట్టింది తృణమూల్ కాంగ్రెస్. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని నేరుగా ఆహ్వానించే వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికింది. ఆ యువకుడు.. విభీషణుడా లేదా తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తా అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఉందని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
ఇదీ చదవండి: కేరళ బరిలో సినీ తారలు- గ్లామర్‌కు ఓటు దక్కేనా?