Babri Masjid Case Iqbal Ansari On Ram Mandir : త్వరలో జరగనున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులపై బాబ్రీ మసీదు కేసులో ముస్లింపక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ హషీమ్ అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. అయోధ్య నగరానికి వచ్చే అతిథులకు ముస్లింల తరఫున స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.
"2019 నవంబర్ 9న (బాబ్రీ మసీదు కేసులో) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. దేశంలోని ముస్లింలు దాన్ని గౌరవించారు. ఇప్పుడు పాత విషయాల్లో ఏం లేదు. అప్పట్లో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పుడు దేశంలో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు జరగలేదు. ప్రస్తుతం రామమందిరం పని జరుగుతోంది. ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు (అయోధ్యకు) వస్తున్నారు. మా (ముస్లింల) వైపు నుంచి కూడా వారందరీకీ స్వాగతం పలుకుతున్నాము."
--ఇక్బాల్ అన్సారీ, బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు
అయోధ్యలో అభివృద్ధి పనులు జరగడం మంచి విషయం అని ఇక్బాల్ అన్సారీ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు వచ్చినప్పుడు తమ అతిథి అవుతారని, కాబట్టి వారిని స్వాగతించడం తమ కర్తవ్యం అని చెప్పారు. వచ్చే అతిథులను స్వాగతించాలని తమ మతం కూడా చెబుతోందని తెలిపారు.
"అయోధ్యలో అభివృద్ధి పనులు జరుగుతుండటం మంచి పరిణామం. అయోధ్యలో ఏం లేవో అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడికి వచ్చిపోయేవారు అయోధ్యకు చాలా చరిత్ర ఉంది కానీ అభివృద్ధి మాత్రం లేదు అని అనేవారు. కానీ ప్రధాని మోదీ వాటన్నింటినీ పూర్తి చేశారు. ఇప్పుడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, అనేక పార్కులు, రోడ్లు ఉన్నాయి. ప్రజల అవసరాలన్నీ తీర్చేశారు. అందుకే ప్రజలు ఆయనను ప్రశంసిస్తారు. మేము కూడా అభినందిస్తాము. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి జరగలేదు. ఏ ప్రభుత్వం దాని గురించి ఆలోచించలేదు. నేడు మోదీజీ, యోగిజీ ఆలోచించారు, అభివృద్ధి చేశారు."
--ఇక్బాల్ అన్సారీ, బాబ్రీ మసీదు కేసులో కక్షిదారు
ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ప్రతి వీధిలో మురుగు కాలువలు వేశారు. రోడ్లు విస్తరించారు. పార్కులను సుందరీకరిస్తున్నారు. పలు పథకాల కింద అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
'అయోధ్య, పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోంది'
అయోధ్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని యాత్రికుడు కుడ్డన్ కుమార్ పాండే అన్నారు. ' అయోధ్య పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోంది. కొత్త అయోధ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇప్పుడు అయోధ్య రామమయంగా మారుతోంది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ ఈ పని చేయడం మన అదృష్టం. ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠకు వంద విమానాలు వస్తున్నాయి. దేశం, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తున్నారు. మేము దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇది కల సాకారం అవడంలా ఉంది. అయోధ్యలో ఇంత అభివృద్ధి జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. దీని ఘనత బీజేపీ ప్రభుత్వాలకే దక్కుతుంది' అని గుడ్డన్ కుమార్ పాండే వివరించారు.
అయోధ్య అరుదైన ఘనత- అతిపెద్ద 'సోలార్ స్ట్రీట్'తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు జోరుగా ఏర్పాట్లు- ట్రస్ట్ దగ్గర ఇంకా రూ.3వేల కోట్లు నిధులు!