Azadi Ka Amrit Mahotsav: మిరియాలకు పేరొందిన ప్రాంతం కేరళ మలబార్. అందుకే మొదట్నుంచీ విదేశీయులతోపాటు స్వదేశీ రాజులందరి కన్నూ దీనిపై ఉండేది. అలాంటి కీలక ప్రాంతంలోని కొట్టాయం రాజ కుటుంబంలో 1753లో జన్మించారు కేరళవర్మ. స్వస్థలం పలషి (కన్నూర్ జిల్లా) కారణంగా పలషి రాజాగా పేరొచ్చింది. తనకన్నా ముందు రాజకుటుంబంలో ముగ్గురు వారసులున్నా... పలషిరాజాకు ప్రజానాయకుడిగా ఎదిగే అవకాశం వచ్చింది. మిరియాల వ్యాపారం, ఓడరేవులపై కన్నేసిన మైసూర్ రాజు హైదర్‌అలీ 1773లో మలబార్‌పై దండెత్తాడు. చాలామంది ఇతర రాజుల మాదిరిగానే... భయంతో కొట్టాయం రాజు పారిపోయి ట్రావెన్‌కోర్‌లో తలదాచుకున్నాడు. ఆ సమయంలో 21 ఏళ్ల పలషిరాజా మాత్రం ప్రజల పక్షాన నిలిచి హైదర్‌అలీతో పోరుకు సిద్ధమయ్యారు. అప్పుడాయన వద్ద బలమైన సైన్యం లేకున్నా తనను నమ్మిన ప్రజలు, కొందరు సైనికుల సాయంతో వయనాడ్ అడవుల్లోంచే గెరిల్లా యుద్ధం చేశారు. హైదర్‌అలీ మృతిచెందాక ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్‌పైనా పలషిరాజా పోరు కొనసాగింది. అదే సమయంలో ఆంగ్లేయులు, టిప్పు సుల్తాన్‌ల మధ్య వైరం మొదలైంది. టిప్పును దెబ్బతీయడానికి బ్రిటిషర్లు సాయం కోరగా... తన రాజ్య భద్రత కోసం పలషిరాజా అంగీకరించారు. ఫలితంగా 1793లో కొట్టాయం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.
ఆంగ్లేయుల వంకర బుద్ధి: ఇరవై ఏళ్ల పోరాటానికి విరామం లభిస్తోందనుకునే సమయంలోనే... ఆంగ్లేయుల ఎత్తుగడ కారణంగా పలషిరాజా మళ్లీ కత్తి పట్టాల్సి వచ్చింది. బ్రిటిష్‌వారు వ్యూహాత్మకంగా పలషిరాజా సమీప బంధువు వీరవర్మను కొట్టాయం పీఠంపై కూర్చోబెట్టారు. పెత్తనమంతా తమ చేతుల్లోకి తీసుకుని ప్రజలపై విపరీతంగా పన్నులు పెంచేసి, వసూలు చేసే బాధ్యత వీరవర్మపై పెట్టారు. పన్నుల పెంపును ప్రశ్నించిన పలషిరాజాకు ప్రజల నుంచి మద్దతు లభించింది. కేరళ సింహంగా ఆయన పేరు మారుమోగింది. ఆంగ్లేయులు 1796లో ఆయన రాజప్రాసాదంపై దాడి చేసి, సంపదనంతా దోచుకుపోయారు. పలషిరాజా మరోసారి అడవుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. వయనాడ్ అడవుల్లోంచి గెరిల్లా తంత్రంతో ఆంగ్లేయులపై విరుచుకుపడుతూ ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన్ని అంతం చేసేందుకు 1797లో మేజర్ కామెరూన్ సారథ్యంలో ఈస్టిండియా కంపెనీ సైన్యం అడవిలోకి అడుగుపెట్టింది. కేరళవర్మ నైపుణ్యం ముందు శత్రు సైనికులు ఆగలేకపోయారు. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వెనక్కి తగ్గిన ఆంగ్లేయులు కేరళ సింహంతో శాంతి ఒప్పందం చేసుకున్నారు.
చేతులెత్తేసిన వెలస్లీ: టిప్పుసుల్తాన్ వీరమరణం (1799) తర్వాత మైసూర్‌ను ఆక్రమించుకున్న ఆంగ్లేయులు... వయనాడ్‌ను కలిపేసుకోవాలని నిర్ణయించారు. పలషిరాజాకు మళ్లీ పనిపడింది. ఈసారి ఆయన పేరు భారత్‌ను దాటి ఇంగ్లాండ్‌కు చేరింది. ఆంగ్లేయులు తమ తురుపు ముక్క జనరల్ ఆర్థర్ వెలస్లీని రంగంలోకి దించడమే ఇందుకు కారణం. తర్వాతి కాలంలో ఈయన సారథ్యంలోనే బ్రిటిష్‌వారు 1815లో ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించారు. ఇంతటి వెలస్లీని కేరళ మెరుపు వీరుడు తన గెరిల్లా యుద్ధతంత్రంతో అల్లాడించారు. చివరికి చేతులెత్తేసి ఇంగ్లాండ్ వెళ్లిపోయిన వెలస్లీ... ‘‘వయనాడ్ అడవుల్లో మేం పోరాడుతున్నది వెయ్యిమందితో కాదు... ఒక్కడితోనే’’ అంటూ పలషిరాజాకు కితాబిచ్చాడు.
నేరుగా ఎదుర్కొంటే గెలవలేమని గ్రహించిన ఆంగ్లేయులు వయనాడ్ అడవుల్లోని కోల్కర్ జాతివారిని తమవైపు తిప్పుకొన్నారు. వారిచ్చిన సమాచారంతో 1805 నవంబరులో పలషిరాజాను అంతమొందించారు. కొట్టాయం కోసం 1774లో పోరాటం ప్రారంభించిన కేరళ సింహం... 52 ఏళ్ల వయసులో నేలకొరిగింది. తమను ముప్పుతిప్పలు పెట్టిన ఈ యోధుడికి ఆంగ్లేయులు... సెల్యూట్ కొట్టి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. ఈస్టిండియా కంపెనీతో 13 సంవత్సరాలపాటు ఆయన చేసిన పోరాటం కొట్టాయం యుద్ధంగా పేరుగాంచింది.
ఇదీ చదవండి: దేవుణ్నీ నిలువు దోపిడీ చేసిన ఆంగ్లేయులు