Azadi ka amrit mahotsav: 1902లో వివేకానందుడు కన్ను మూసేనాటికి భారత జాతీయోద్యమం ఊపందుకోలేదు. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ పాలన స్థిరపడింది. పోరాటం కంటే... ఆంగ్లేయులతో కలసి పాలనలో భాగస్వామ్యం పెంచుకునే దిశగానే ఆలోచనలు సాగుతున్న కాలమది. వివేకానందుడు మాత్రం... భారత్‌కు స్వాతంత్య్రం రావటం ఖాయమని గుర్తించారు. రాబోయే స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన శక్తియుక్తులను జాతి ముందే సంపాదించుకోవాలని బలంగా నమ్మారు. ఆ క్రమంలో జరిగిందో ఆసక్తికర ఘటన!
1893 మే 31న జపాన్ నుంచి వాంకోవర్‌కు బయల్దేరిందో ఓడ. వివేకానందుడు, టాటా సంస్థ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా కలసి ప్రయాణిస్తున్నారందులో. వివేకానందుడు షికాగోలోని ప్రపంచ మతసమ్మేళనానికి వెళుతుంటే... అక్కడే ఏర్పాటైన ఓ పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు బయల్దేరారు టాటా! రెండు మేధస్సులు... మనసారా మాట్లాడుకున్నాయా సుదీర్ఘ ప్రయాణంలో! భారత్‌ను పారిశ్రామిక దేశంగా నిలబెట్టేందుకు అవసరమైన పరికరాల కోసం తాను అన్వేషిస్తున్నట్లు టాటా చెప్పారు. ఆయన ఉత్సాహాన్ని ప్రశంసించిన వివేకానందుడు... భారత్‌లోనే ఉపాధి సృష్టించేలా పారిశ్రామికీకరణ జరిగేలా చూడండన్నారు. ఉదాహరణకు అగ్గిపెట్టెలను జపాన్ నుంచి దిగుమతి చేసుకునే బదులు... భారత్‌లోనే తయారు చేస్తే, గ్రామీణులకు బోలెడంత ఉపాధి లభిస్తుందని సూచించారు. సైన్స్‌తో పాటు సాంకేతికతలో కూడా మనవాళ్లను సిద్ధం చేస్తే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. ఓ సైన్స్ పరిశోధన సంస్థను ఏర్పాటు చేయటానికి టాటా వెంటనే ముందుకొచ్చారు. తథాస్తు... అంటూనే సైన్స్‌కు తోడుగా ఆర్ట్స్‌ను (హ్యుమానిటీస్) కూడా మేళవించమన్నారు వివేకానందుడు!
ఈ వినూత్న సూచన నచ్చిన టాటా ఐదేళ్ల తర్వాత... వివేకానందుడికి లేఖ రాశారు. ఆ కాలంలోనే రూ.30 లక్షలతో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారు. సైన్స్‌తో పాటు భారతీయ భాషలు, చరిత్రపైనా పరిశోధించేందుకు నిర్ణయించారు. దానికి వివేకానందుడిని సారథ్యం వహించమన్నారు. కానీ... అప్పటికే రామకృష్ణ మిషన్ వ్యవహారాల్లో మునిగితేలుతున్న స్వామీజీ సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూనే.. కలసి పని చేద్దామన్నారు.
ఇంతలో జంషెడ్‌జీ టాటా... ఆంగ్లేయ వైస్రాయ్ లార్డ్ కర్జన్‌ను కలసి తమ ప్రతిపాదన తెలిపారు. వెంటనే కర్జన్ దాన్ని అసాధ్యమని కొట్టిపారేశాడు. పైగా... భారతీయులకు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందుకునే తెలివి లేదని అవహేళన చేశాడు. ‘‘మీ ప్రాజెక్టును మరచిపోయి... మీరనుకుంటున్న రూ.30 లక్షలు మాకివ్వండి... ఏదైనా చేస్తాం’’ అంటూ వైస్రాయ్ కర్జన్... టాటాకు సూచించారు. టాటా డైలమాలో పడిపోయారు.
కన్నుమూసినా కల నిజమైంది
ధైర్యం కోల్పోవద్దని చెప్పిన వివేకానందుడు... విదేశాల నుంచి వచ్చి భారతీయతను నరనరాన నింపుకొన్న తన శిష్యురాలు సిస్టర్ నివేదితకు పరిశోధన సంస్థ సాకార బాధ్యత అప్పగించారు. ఆమె అమెరికా, స్కాట్లాండ్ తదితర దేశాల్లోని అనేక మంది మేధావులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి... పరిశోధన సంస్థ ఆవిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దురదృష్టవశాత్తు 1902లో వివేకానందుడు, మరో రెండేళ్లకు జంషెడ్‌జీ తమ కల నెరవేరకుండానే కన్నుమూశారు. కానీ... వారి సంకల్ప బలాన్ని సిస్టర్ నివేదిత వృథా కానివ్వలేదు. కొత్త వైస్రాయ్ లార్డ్ మింటోను ఒప్పించడంతో 1909లో బెంగళూరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆవిష్కృతమైంది. వివేకానందుడి శిష్యుడైన మైసూరు మహారాజు చామరాజ వడియార్ కుమారుడు కృష్ణరాజ వడియార్... 370 ఎకరాలను ఈ కేంద్రం ఏర్పాటుకు బహుమతిగా ఇచ్చారు. స్వామి వివేకానంద-జంషెడ్‌జీ టాటా కోరుకున్నట్లే... ఈ పరిశోధన కేంద్రం... స్వతంత్ర భారత్‌లో శాస్త్రసాంకేతికతకు పుట్టిల్లైంది. బోలెడన్ని సంస్థలను, వేలమంది శాస్త్రవేత్తలను పుట్టించింది. నేటికీ పుట్టిస్తోంది! తర్వాత హ్యుమానిటీస్‌లో విడిగా పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Azadi ka amrit mahotsav: మన చదువుల్ని కాపీ కొట్టి... మనను ఏమార్చి