Velayudhan Chempakaraman Thampi: కేరళలోని తక్కోలం (ప్రస్తుతం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా) అనే గ్రామంలో 1765 మే 6న దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆ ఊరిలో తంపి చంపకరామన్ వేలాయుధన్ అనే వీరుడు జన్మించాడు. ఆయన్ని ముద్దుగా వేలుతంపి అని పిలిచేవారు. రాజా మార్తాండవర్మ దగ్గర పనిచేసిన వేలుతంపి పూర్వీకులు సొంత భూములు, ఆస్తులు సంపాదించుకున్నారు. చదువులు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వేలుతంపి, యుక్తవయసు వచ్చాక తిరువాన్కూరు(ట్రావెన్‌కోర్)లోని మావెలికారకు తహశీల్దారుగా నియమితులయ్యారు. ఆ సమయంలో రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజు బలరామవర్మను నామమాత్రుడిని చేసిన సైన్యాధ్యక్షుడు జయంతన్, మంత్రులు కుంజునీలపిళ్లై, శంకరనారాయణన్, మాతూ తరగన్‌ల అక్రమాలు, అరాచకాలు పెచ్చరిల్లాయి. ఖజానాను నింపేందుకు ఇష్టారీతిగా పన్నులు పెంచారు. వేలుతంపిని మూడు రోజుల్లో ఏకంగా రూ.3000 తేవాలని ఆదేశించారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్న వేలుతంపి తమ ప్రాంతం నుంచి రైతులను తీసుకుని మహాపాదయాత్రగా రాజధానికి బయలుదేరారు. మార్గమధ్యలో వేల మంది తోడయ్యారు. రాజును కలిసి తమ సమస్యలన్నీ వివరించారు. చలించిన రాజు దుష్ట చతుష్టయాన్ని పదవుల నుంచి తొలగించారు. వేలుతంపినే ప్రధానిగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించాక ప్రజలు, రైతులపై పన్నులను తగ్గించారు. ఆర్థిక ఆంక్షలను కఠినంగా అమలు చేయడం వల్ల మార్పు కనిపించింది.
అవకాశాన్ని అలుసుగా తీసుకున్న ఆంగ్లేయులు.. ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నంలో సైన్యంపై చేస్తున్న ఖర్చులో వేలుతంపి కోత విధించారు. ఇది సైన్యాధికారులకు రుచించలేదు. వారంతా రాజధానిని ముట్టడించారు. వేలుతంపి కొచ్చిన్‌కు వెళ్లి ఈస్టిండియా కంపెనీ రెసిడెంట్ మెకాలే సాయం తీసుకుని, అంతర్యుద్ధాన్ని అణచి వేయించారు. దీనికి ప్రతిగా ఈస్టిండియా కంపెనీ అధికారులు ట్రావెన్‌కోర్‌ను 'సైన్య సహకార వ్యవస్థ'లోకి తీసుకున్నారు. తమకు ఖర్చులను చెల్లించాలని, భారీగా కప్పం కట్టాలని షరతు విధించారు. ఆంగ్లేయుల గొంతెమ్మ కోర్కెలు నచ్చని వేలుతంపి వారికి 'మేం కప్పం సహా ఏమీ చెల్లించబోం' అంటూ తేల్చి చెప్పారు. ఈస్టిండియా కంపెనీ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించి.. వారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. ఆయుధాలు, ఆహార సామగ్రిని భారీగా సమకూర్చుకున్నారు. అలెప్పీ నుంచి 1808 డిసెంబరు 27న సైన్యంతో బయలుదేరి క్విలోన్ (ప్రస్తుత కొల్లాం) చేరుకున్నారు.
అక్కడ 1809 జనవరి 16న 'మనకు ఆంగ్లేయులే ప్రధాన శత్రువులు. పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి ప్రజలంతా ఏకమై పోరాటం చేయాలి' అని ఉద్వేగంగా ప్రసంగించారు. జాగృతమైన యువకులు కత్తులు, గొడ్డళ్లను చేతబూని సైన్యంలో చేరారు. ఆంగ్లేయులతో జనవరి 19న ప్రారంభమైన యుద్ధం.. ఫిబ్రవరి 21న ముగిసింది. ఫిరంగులను, తుపాకులను తట్టుకోలేక వేలుతంపి సైన్యం ఓడిపోగా ఆయన తన సోదరుడు పద్మనాభన్‌తో కలిసి అడవుల్లోకి పారిపోయారు. అనంతరం రాజు బలరామవర్మ ఈస్టిండియా కంపెనీకి లొంగిపోయారు. వేలుతంపిని పట్టిస్తే రూ.50 వేలు బహుమతిగా ఇస్తామని తెల్లవారు ప్రకటించారు. కొందరు డబ్బుకు ఆశపడి ఇచ్చిన సమాచారంతో.. వేలుతంపి సేదదీరుతున్న కాళికాలయాన్ని 1809 మార్చి 29న మెకాలే సైన్యం చుట్టుముట్టింది. ఆంగ్లేయుల చేతిలో చనిపోవడానికి ఇష్టపడని తంపి తన తమ్ముడికి ఖడ్గాన్ని అందించి చంపమని ఆదేశించగా.. నిస్సహాయ స్థితిలో పద్మనాభన్ తన అన్న తుది కోరికను తీర్చారు. తీవ్ర నిరాశకు గురైన ఆంగ్లేయులు.. ఆ వీరుడి మృతదేహాన్ని ఉరి వేసుకున్నట్లుగా చెట్టుకు వేలాడదీసి కసితీర్చుకున్నారు.
ఇదీ చదవండి: Horoscope Today (06-04-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?