AZADI KA AMRIT MAHOTSAV: పంజాబ్‌లోని సునామ్ గ్రామంలో 1899 డిసెంబరు 26న పుట్టిన షేర్ సింగ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. సిక్కు అనాథ శరణాలయంలో పెరిగే క్రమంలో సోదరుడు కూడా మరణించటంతో పూర్తిగా ఒంటరయ్యాడు. సైన్యంలో చేరిన వారికి... భూమితో పాటు ఆర్థికసాయం చేస్తామంటూ హామీ ఇవ్వటంతో... తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సేనలో కార్మికుడిగా చేరాడు. కానీ యుద్ధానంతరం బ్రిటిష్ ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చకుండా చెయ్యిచ్చింది. రెండేళ్లు పనిచేయించుకొని కేవలం 200 రూపాయలు చేతిలో పెట్టింది. ఈ మోసానికి తోడు... అదే సమయంలో... జలియన్‌వాలాబాగ్ ఊచకోత కూడా తోడవటంతో... ఆంగ్లేయులపై ఆగ్రహం గుట్టలుగా పేరుకుపోయింది. వేల కుటుంబాలను అనాథలను చేసిన... ఈ దారుణ మారణ కాండకు ఆదేశించిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఫ్రాన్సిస్ మైఖెల్ ఓ డయ్యర్‌పై అందరిలోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ... అందరిలా ఆ బాధనలా విడిచిపెట్టకుండా... కాలగర్భంలో కలసిపోనీయకుండా... జలియన్‌వాలాబాగ్ రక్తపు మట్టి సాక్షిగా... తన గుండెల్లోనే దాచుకున్నాడు ఉధమ్.
ఇదే సమయంలో పంజాబ్‌లో విస్తరించిన విప్లవవాద గదర్‌పార్టీకి ఆకర్షితుడైన ఉధమ్ అందులో ఇమిడిపోయాడు. ఇంతలో రైల్వే లైను పనుల కోసం ఉగాండాకు, ఆ తర్వాత మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి... అక్కడ గదర్‌పార్టీలో కీలకమయ్యాడు. జలియన్‌వాలాబాగ్ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి కావటంతో... అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో గదర్ సమావేశాల్లో ఉధమ్‌కు చోటిచ్చేవారు. అదే ఊపులో... ఫ్రాంక్ బ్రెజిల్ అనే మారుపేరుతో... యూరప్‌లోనూ పర్యటించి, గదర్‌పార్టీని విస్తృతం చేశాడు. 1927లో భారత్‌కు వచ్చిన ఉధమ్‌ను... ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి... ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక్కడే తనకు భగత్‌సింగ్‌తో పరిచయమైంది. 1931లో జైలు నుంచి విడుదల కాగానే... పోలీసుల కళ్లుగప్పి... యూరప్‌లోని పలు దేశాలకు వెళ్లి... 1934లో లండన్ చేరుకున్నాడు ఉధమ్. ఎక్కడికి వెళ్లినా గదర్‌పార్టీ కార్యకలాపాలతో పాటు.. వడ్రంగి, ఎలక్ట్రీషియన్... ఇలా ఏదో ఒక పని చేస్తూ సంపాదించుకునేవాడు.
వణికిన లండన్
ఇవన్నీ... సాగుతున్నా గుండెల్లో గూడుకట్టుకున్న జలియన్‌వాలాబాగ్ కసి మాత్రం అలాగే రగులుతోంది. 1940 మార్చి 13న లండన్ కాక్స్‌టన్ హాల్‌లో... రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. పంజాబ్ మాజీ గవర్నర్ జనరల్ మైఖెల్ ఓ డయ్యర్‌తో పాటు 450 మంది దాకా ప్రముఖులు హాజరయ్యారు. కోటులో పిస్తోలుతో వచ్చిన ఉధమ్... సమావేశం ముగిశాక... డయ్యర్‌కు గురిపెట్టి ఆరు రౌండ్ల తూటాలను కాల్చాడు. డయ్యర్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కొట్టుకుని మరణించాడు. యావత్ లండన్ గజగజ వణికిపోయింది. బ్రిటన్‌కు వచ్చి నడి లండన్‌లో ప్రముఖుడిని కాల్చటంతో... బ్రిటిష్ ఉన్నతాధికారులంతా భయపడిపోయారు.
అరెస్టు సమయంలో సర్వమత భారత్‌కు ప్రతీకగా.. తన పేరును మహమ్మద్ సింగ్ ఆజాద్‌గా పేర్కొన్నాడు ఉధమ్. ఉరిశిక్ష ఖాయం చేస్తూ... ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా... అని న్యాయమూర్తి అడగ్గా... 'బ్రిటిష్ సామ్రాజ్యంపై మా భారతీయుల తిరుగుబాటుకు ప్రతీక నా దాడి. ఇంగ్లాండ్‌లోని సామాన్యులంటే మాకెలాంటి ద్వేషం లేదు. నిజానికి ఇక్కడి కార్మికులూ కష్టాల్లో ఉన్నారు. ఈ దుష్ట బ్రిటిష్ పాలనపైనే మా ఆగ్రహమంతా' అంటూ ప్రకటించాడు ఉధమ్. 1940 జులై 31న ఆయన్ను లండన్‌లో ఉరితీశారు. 1974లో ఉధమ్ అస్థికలను భారత్‌కు తీసుకొచ్చినప్పుడు... దేశం మొత్తం నివాళులర్పించింది. పంజాబ్‌లో ఊరూరా అస్థికలను ఊరేగింపుగా తిప్పి...లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
- రామోజీ విజ్ఞాన కేంద్రం
ఇదీ చూడండి: '15-18 ఏళ్ల వారికి కరోనా టీకా.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్'