Azadi ka amrit mahotsav: 1857... మేరఠ్‌లో మొదలైన తొలి స్వాతంత్య్ర పోరాటం దేశమంతా విస్తరిస్తున్న కాలమది. తెల్లవాళ్లను గెంటేయాలని నినదిస్తున్న సమయమది. సిపాయిల తిరుగుబాటును అణచివేసేందుకు దళాలను దిల్లీకి పంపాలని హైదరాబాద్ నిజాంను ఈస్టిండియా కంపెనీ అధికారులు ఆదేశించారు. అందుకు మహారాష్ట్రలోని బుల్దానాలో ఉండే నిజాం అశ్వికదళ సైనికులు నిరాకరించగా సైనికాధికారులు వారందరినీ ఖైదు చేశారు. ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన చీదాఖాన్ అనే జమీందారు తన 15 మంది సైనికులతో హైదరాబాద్ వచ్చి, బ్రిటిష్‌వారిపై తిరుగుబాటుకు అప్పటి నాలుగో నిజాం అఫ్జల్ ఉద్దౌలా సాయం కోరారు. నాటి మంత్రి మీర్ తురాబ్ అలీఖాన్ అతడిని అరెస్టుచేసి ఆంగ్లేయులకు అప్పగించగా... కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీలో (ప్రస్తుత కోఠి మహిళా కళాశాల) బంధించారు.
యుద్ధరంగంగా మారిన కోఠి
తమ సైనికులను బ్రిటిషర్లకు నిజాం అప్పగించడం హైదరాబాద్‌లోని సైనికులు, మేధావులకు నచ్చలేదు. వారిలో తొలి వరుసలో నిలిచిన తుర్రేబాజ్ ఖాన్ తమవారిని విడిపించాలని పట్టుబట్టారు. ఆయనకు అల్లావుద్దీన్ మౌల్వీ అనే మత బోధకుడు, కొందరు రోహిల్లా సైనికులు, విద్యార్థులు తోడయ్యారు. ఆయుధాలు అందుకుని 1857 జులై 17న కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి పూనుకున్నారు. వీరికోసం జైగోపాల్ దాస్, అబ్బాన్ సాహెబ్ అనే ఇద్దరు ప్రముఖులు పుత్లీబౌలీలో తమ భవంతులను ఖాళీ చేశారు. వాటిలోంచి సాయంత్రం 6గంటలకు కాల్పులు ప్రారంభించిన తుర్రేబాజ్ ఖాన్ అనుచరులు... రెసిడెన్సీ ఎడమవైపు ద్వారాన్ని కూల్చేశారు. వీరు లోనికి వెళ్లగా... రెసిడెంట్ డేవిడ్సన్ సిద్ధంగా ఉన్నాడు. నిజాం మంత్రి తురాబ్ అలీఖాన్ ఉప్పందించడంతో పోరుకు అతడు ముందే సిద్ధమయ్యాడు. ఇది ఊహించని తిరుగుబాటుదారులు ప్రాణాలకు తెగించి తెల్లవారుజామున 4.30 వరకు పోరాడారు. చాలామంది అమరులవగా... కొందరు పారిపోయారు. తుర్రేబాజ్ ఖాన్, అల్లావుద్దీన్ మౌల్వీ మరోసారి దాడి చేయాలని యోచించారు.
తూప్రాన్‌లో చంపి..
తుర్రేబాజ్ ఖాన్ షాద్‌నగర్ అడవుల్లో ఉన్నారని నిజాం సైనికులు ఇచ్చిన సమాచారంతో జులై 22న ఆయన్ను అరెస్టు చేశారు. ఎంత హింసించినా అల్లావుద్దీన్ మౌల్వీ గురించి సమాచారం ఇవ్వలేదు. కాలాపానీకి తరలించేలోపే తుర్రేబాజ్ 1859 జనవరి 18న జైలు నుంచి తూప్రాన్ అడవుల్లోకి పారిపోయారు. ఆయనను పట్టిస్తే రూ.5వేల నజరానా ప్రకటించారు. అది ఇప్పటి కరెన్సీలో రూ.50లక్షల పైమాటే! డబ్బులకు ఆశపడిన నిజాం అధికారి ఖుర్బాన్ అలీఖాన్... తుర్రేబాజ్ ఖాన్‌ను జనవరి 24న తుపాకీతో కాల్చి చంపేశాడు. భౌతికకాయాన్ని గుర్రానికి కట్టి... తూప్రాన్ నుంచి కోఠి వరకు లాక్కొచ్చారు. భావి తిరుగుబాట్లు తలెత్తకుండా తుర్రేబాజ్ ఖాన్ భౌతిక కాయాన్ని కోఠిలోని రెసిడెన్సీకి ఎదురుగా ఒక చెట్టుకొమ్మకు వేలాడదీసి, కుళ్లిపోయే వరకూ అలాగే ఉంచారు. తుర్రేబాజ్ ఖాన్ మరణించినా తనపేరు ధైర్యానికి మారుపేరుగా నేటికీ నిలిచేఉంది. తురుంఖాన్‌ను చంపినందుకు నిజాంకు బ్రిటిషర్లు రూ.55 లక్షల అప్పును మాఫీ చేయడంతో పాటు, అతడి మంత్రి తురాబ్ అలీఖాన్‌కు సాలార్‌జంగ్ బిరుదును బహూకరించారు.
దక్షిణ భారతం జారిపోయేది
‘తుర్రేబాజ్ ఖాన్ తిరుగుబాటు విజయవంతమైతే.. దక్షిణ భారతదేశం మన చేతుల్లో నుంచి జారిపోయేది. మన విజయానికి నిజాం, అతని మంత్రి చేసిన సాయం మరువలేనిది’ అని కోఠి రెసిడెంట్ డేవిడ్సన్ లేఖ రాశారంటేనే ఈ ముట్టడి తీవ్రత తెలుస్తుంది.
కోఠిలో అమరుల స్తూపం
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక... తుర్రేబాజ్ ఖాన్, ఆయన సహచరుల ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తి నింపేలా... కోఠి బస్టాండులో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఎదురుగా ఉన్న వీధికి తుర్రేబాజ్ ఖాన్ స్ట్రీట్ అని పేరు పెట్టారు.
ఇదీ చదవండి: Azadi ka Amrit Mahotsav: గాంధీ.. మేడ్ ఇన్ దక్షిణాఫ్రికా