AZADI KA AMRIT MAHOTSAV: చావో రేవో అంటూ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అదుపులోకి తీసుకొని జైళ్లలో పెట్టింది. తద్వారా అత్యంత కీలకమైన ఉద్యమానికి నాయకత్వం లేకుండా చేయాలని చూసింది. కానీ ఆంగ్లేయుల ఎత్తుగడ విఫలమైంది. నేతలు అరెస్టయినా సామాన్యులే ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. గాంధీజీ నినాదం దావానలంలా ఊరూరా వ్యాపించింది. ఉద్యమం ఉప్పెనలా కొనసాగింది. ఎంతోమంది అరెస్టయ్యారు. అసువులు బాశారు. పల్లెటూర్లలో సైతం ప్రతిఒక్కరూ తామే గాంధీజీ అన్నట్లు పోరాడారు. అలాంటి వారిలో ఒకరు... తారా రాణి శ్రీవాస్తవ!
పట్నా సమీపంలోని సారణ్‌లో రాణి శ్రీవాస్తవ జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఫూలేంద్ర బాబును పెళ్లాడారు. భార్యను నాలుగు గోడల మధ్య బంధించకుండా.. ఫూలేంద్ర నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. గాంధీజీ ప్రసంగాలతో ప్రభావితురాలైన తారా రాణి... భర్త మాదిరిగానే జాతీయోద్యమంలోకి దూకారు. ఇతర మహిళలందరినీ కూడగట్టి క్విట్ ఇండియా ఉద్యమంలోకి తీసుకొచ్చారు.
సీనియర్ నేతలంతా అరెస్టవడంతో ఫూలేంద్ర ఓ రోజు ప్రజలందరినీ సమీకరించి సీవాన్ పోలీసు స్టేషన్‌కు ప్రదర్శనగా బయలుదేరారు. ఆ రోజు ఎలాగైనా పోలీసు స్టేషన్‌పై త్రివర్ణ పతాకం ఎగరేయాలన్నది వారి లక్ష్యం. తారా రాణి కూడా భర్తతో పాటు... మహిళలను పోగేసి ప్రదర్శనకు వచ్చారు. పోలీసులు ఈ ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. లాఠీఛార్జి చేసినా ప్రదర్శన ఆగకపోవటంతో తుపాకులు ఎక్కుపెట్టారు. కానీ ఫూలేంద్ర బృందం పట్టుదల వీడలేదు. తుపాకుల గర్జన మొదలైంది. ముందుండి నడిపిస్తున్న ఫూలేంద్రనే తొలి తూటా తాకింది. భర్త నేలకొరగటం చూసిన తారా రాణి వెంటనే ముందుకు దూకి... తన చీర చింపి ఆయన గాయానికి కట్టు కట్టారు. అక్కడితో ఆగకుండా... అందరినీ ఆశ్చర్యపరుస్తూ భర్త చేతిలోంచి జెండా తీసుకొని లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ధైర్యంగా పోలీసు స్టేషన్ దిశగా పరుగు తీశారు. విజయవంతంగా పోలీసు స్టేషన్‌పై జెండా ఎగరేశారు. ఆ వెంటనే భర్త దగ్గరికి పరుగున వచ్చారు. ఎగురుతున్న జెండాను చూస్తున్నట్లుగా ఫూలేంద్ర పడిపోయి ఉన్నారు. అప్పటికే విగతజీవుడయ్యారు. చాప్రాలో ఫూలేంద్ర సంస్మరణార్థం భారీ సభ నిర్వహించగా... వందల మంది వచ్చి నివాళులర్పించారు. భర్త మరణానికి మౌనంగా రోదించిన తారా రాణి... ఆ తర్వాత కూడా జాతీయోద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చేదాకా భర్త ఆశయాలకు అనుగుణంగా పోరాటంలో తనవంతు పాత్ర పోషించిన విస్మృత వీర వనిత తారా రాణి శ్రీవాస్తవ!
ఇదీ చూడండి: ఆత్మాభిమానమే ముఖ్యం.. రారాజుకు నిర్మానుష్య స్వాగతమే!