Azadi ka amrit mahotsav: ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్ లోయలో 1890 ఫిబ్రవరిలో సంపన్న పస్తూన్ కుటుంబంలో జన్మించిన నాయకుడు గఫార్‌ఖాన్. అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ఈ వాయవ్య సరిహద్దు రాష్ట్రం (ప్రస్తుతం పాకిస్థాన్‌లో) స్థానిక తెగల ఘర్షణలకు పెట్టింది పేరు. అలాంటి చోటు నుంచి వచ్చి... అహింస, సత్యాగ్రహాల బాటలో తనతో పాటు తన ప్రజలనూ నడిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు గఫార్‌ఖాన్. అందుకే ఆయనను గాంధీజీ ‘సరిహద్దు గాంధీ’ అని ఆప్యాయంగా పిలిచేవారు. పాఠశాలలో చదువుకున్న సమయంలో ఆంగ్లేయ సైనికులు, అధికారుల ఆధ్వర్యంలో నడిచే కార్ప్స్, గైడ్స్‌లో చేరారు. అయితే... తమను ఆంగ్లేయులు ద్వితీయశ్రేణి పౌరులుగా చూడటంతో దాన్లోంచి బయటకు వచ్చారు. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదవటానికి వచ్చిన గఫార్‌ఖాన్ 1911లో జాతీయోద్యమంలో చేరారు. స్థానిక తెగల అంతర్యుద్ధానికి... ఆంగ్లేయుల వివక్ష తోడవటంతో... తమ ప్రాంతం వెనకబాటును గుర్తించారాయన. 1915-18 మధ్య 500 గ్రామాల్లో పర్యటించారు. హింసకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చైతన్య పరిచారు. విద్య, సామాజిక సంస్కరణల ఆవశ్యకత చెబుతూ పాఠశాలలు తెరిచారు. కానీ బ్రిటిష్ సర్కారు ఆ బడులను నిషేధించటంతో పాటు ఆయన్నూ అరెస్టు చేసి వేధించింది. 1928లో మహాత్మాగాంధీతో పరిచయమయ్యాక... జాతీయోద్యమంలో గఫార్‌ఖాన్ పాత్ర పెరిగింది. ఇద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరింది.
Badshah khan
హజ్ యాత్రకు వెళ్లి వచ్చాక గాంధీ అహింస, సత్యాగ్రహాల ఆధారంగా... ఖుదాయ్ కిద్‌మత్‌గార్ (దేవుడి సేవకులు) ఉద్యమాన్ని ఆరంభించారు గఫార్‌ఖాన్. తాము పోరాట జాతిగా వర్గీకరించిన ఈ ప్రాంత ప్రజలు అహింసా ఉద్యమానికి మద్దతు పలకటం ఆంగ్లేయులను ఆశ్చర్యపరచింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాలు పంచుకున్న వీరిపై బ్రిటిష్ సర్కారు దారుణంగా కాల్పులు జరిపింది. వందలమంది మరణించారు. గఫార్‌తో కలసి గాంధీజీ స్వయంగా పర్యటించి... పస్తూన్ ప్రజలకు మద్దతు పలికారు. నిర్వహణ సామర్థ్యం, నిజాయతీ, దేశభక్తిని గమనించిన జాతీయ కాంగ్రెస్ నేతలు గఫార్‌ఖాన్‌కు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించాలని నిర్ణయించారు. కానీ ఆయన ‘నేను సామాన్య సైనికుడిని. సేవ చేయనివ్వండి చాలు’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. 1939లో కాంగ్రెస్‌తో విభేదించి విడిపోయిన ఆయన... మళ్లీ 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో కలిశారు.
ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్థాన్ డిమాండ్ చేస్తున్న వేళ... గఫార్‌ఖాన్, ఆయన ఖుదాయ్ కిద్‌మత్‌గార్‌లు... ఐక్య భారత్‌ను కోరుకున్నారు. ఆంగ్లేయులు వెళ్లిపోయాక హిందూ-ముస్లింలు ఐక్యంగా ఉండొచ్చని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఎంతో గౌరవించిన ఆయనను ఏమాత్రం సంప్రదించకుండానే... దేశవిభజన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ‘‘మమ్మల్ని తోడేళ్లకు వదిలేశారు’’ అంటూ గఫార్‌ఖాన్ ఎంతో ఆవేదన వ్యక్తంజేశారు. ఆగ్రహంతో వాయవ్య రాష్ట్రంలో రెఫరెండంను కూడా కిద్‌మత్‌గార్‌లు బహిష్కరించారు. దీంతో... ఈ ప్రాంతం అనివార్యంగా పాకిస్థాన్‌లో కలిసిపోయింది. దేశవిభజన సమయంలో అనేక మంది హిందువులు, సిక్కుల ప్రాణాలను కాపాడారు గఫార్‌ఖాన్.
పాకిస్థాన్ ఏర్పడ్డాక తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని గఫార్‌ఖాన్ కోరగా... మహమ్మద్ అలీ జిన్నా తిరస్కరించాడు. అంతేగాకుండా.. గఫార్‌ఖాన్‌ను, ఆయన అనుచరులను పాకిస్థాన్ వ్యతిరేకులుగా, భారత అనుకూలురుగా ముద్రవేసి వేధించారు. అనేకసార్లు ఆయన్ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది. చివరకు 1964లో అఫ్గానిస్థాన్‌లో శరణార్థిగా ఆశ్రయం తీసుకున్నారాయన. 1972 ఎన్నికల్లో తమ రాష్ట్రంలో ప్రగతిశీల జాతీయ అవామీ పార్టీ నెగ్గటంతో తిరిగి వచ్చిన ఆయన్ను భుట్టో ప్రభుత్వం మళ్లీ అరెస్టు చేసింది. స్వాతంత్య్ర సమరంలో సేవలకుగాను 1987లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ఆయనకు అందజేసింది.
సరిహద్దులు చెరిగిన వేళ..
1988 జనవరి 22న 98వ ఏట పెషావర్‌లో మరణించిన గఫార్‌ఖాన్ మృతదేహాన్ని అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌కు తరలించారు. అఫ్గాన్ అధ్యక్షుడు, భారత ప్రధాని అంత్యక్రియలకు హాజరయ్యారు. అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ఆ ఒక్కరోజు ఎవరైనా తమ దేశానికి వచ్చేలా వీసా నిబంధనలను రద్దు చేసింది. సోవియట్-అఫ్గాన్ యుద్ధం ఆగిపోయింది. దాదాపు 2లక్షల మందికిపైగా అభిమానుల వెల్లువలో అఫ్గానిస్థాన్-పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఆ రోజు చెరిగిపోయింది.
ఇదీ చదవండి: తుపాకికే తాళికట్టి.. ఆంగ్లేయులకు చిక్కబోననే ప్రతిజ్ఞ చేసి..