Azadi Ka Amrit Mahotsav: గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా.. సముద్రంలో ఓడలకు ప్రమాదాలు జరిగేవి. వీటిని నివారించటానికి భారత్‌లో విపరీతమైన మార్కెట్‌గల ఉప్పును ఓడల్లో నింపి దిగుమతి చేయటం మొదలెట్టారు ఆంగ్లేయులు. లాభాలు ఆర్జించడానికి భారత్‌లో ఉప్పు తయారీ, అమ్మకాలపైనా ఆంక్షలు, అధిక పన్నులు వేశారు. సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టారు. గాలి, నీరు తర్వాత మనిషికి నిత్యావసరమైన ఈ ఉప్పునే బ్రిటిష్‌పై తన ఆయుధంగా మలచారు గాంధీజీ!
ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీజీ 1930 మార్చి 2న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాస్తే ఆయన నవ్వుకొని పక్కనపడేశారు. బ్రిటిష్ పత్రికలు కూడా గాంధీ ఆలోచనలను చూసి ఎగతాళి చేశాయి. 'గాంధీ పిల్లచేష్టలు చూసి నవ్వాగట్లేదు. భారతీయులందరి ఆలోచనా స్థాయికి ఇది అద్దం పడుతుంది' అని రాశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ సందేహాలు తలెత్తాయి. కారణం.. అంతకుముందు 1929 డిసెంబరులో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారీస్థాయిలో శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలని తీర్మానించారు. గాంధీ ఆ పని చేయకుండా.. ఉప్పు పన్నుపై పోరు అనటం కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యపర్చింది. ముఖ్యంగా.. గాంధీజీ కుడి ఎడమ భుజాలనుకున్న జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌లతో పాటు మోతీలాల్ నెహ్రూ, జమ్నాలాల్ బజాజ్, సరోజినీ నాయుడు తొలుత ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. గాంధీజీ మాత్రం తన పనిలో నిమగ్నమయ్యారు. "వెనక్కి తిరిగే ప్రశ్నే లేదిక. వేల మంది తోడైనా కాకున్నా ఒంటరిగానైనా నా యత్ర కొనసాగిస్తా. ఈ క్రమంలో విఫలమై వెనక్కి వెళ్లేకంటే కుక్కచావు చచ్చినా ఫర్వాలేదు. అనుకున్నది సాధించాకే ఆశ్రమం చేరుకుంటా. లేదంటే సముద్రంలో నా శవం తేలుతుంది" అంటూ ఉద్వేగంగా ప్రసంగించిన గాంధీజీ... యాత్రలో తనతో కలసి నడవటానికి వివిధ ప్రాంతాల నుంచి 78 మందిని (ఆంధ్ర నుంచి సుబ్రహ్మణ్యం) వాలంటీర్లుగా ఎంపిక చేసుకున్నారు. తంబూరాలు చేతబూని.. భజనలు, ప్రార్థనలు చేసుకుంటూ ఈ చిన్ని సైన్యం 1930 మార్చి 12న ఉదయం 6.30కి సబర్మతి నుంచి బయల్దేరింది. ఊరూరా వందల మంది జమకావటంతో జనప్రవాహమైంది. 61 ఏళ్ల గాంధీజీ రోజుకు పది మైళ్ల చొప్పున నడుస్తూ, సభల్లో మాట్లాడుతూ ప్రార్థనల్లో పాల్గొంటూ... మధ్యమధ్య నూలు వడుకుతూ, లేఖలు, వ్యాసాలు, దైనందిని(డైరీ) రాసుకుంటూ సాగారు. పొద్దున్నే 4 గంటలకు లేచి.. లాంతరు ఆరిపోతే వెన్నెల వెలుగులోనే ఉత్తరాలు రాసేవారు. ఆయన పిలుపు అందుకొని అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమంలో దిగారు.
గాంధీ వెంటనడిచేవారి వరుస మూడున్నర కిలోమీటర్ల పొడవుకు చేరుకుంది. అమెరికన్ జర్నలిస్టు వెబ్ మిలర్ పంపించిన ప్రత్యక్ష కథనాలు, ఫొటోలను ప్రపంచవ్యాప్తంగా 1350 పత్రికలు ప్రచురించాయి. భారత జాతీయోద్యమంపై సానుభూతి పెంచాయి. ఉప్పు సత్యాగ్రహం ఉప్పెనలా ముంచుకొస్తోందని ఆంగ్లేయులు ఆలస్యంగా గుర్తించారు. అలాగని వెంటనే అరెస్టు చేస్తే గాంధీ మరింత హీరో అవుతారని భయపడ్డారు. కాకుంటే ఎక్కడికక్కడ ఉప్పు సత్యాగ్రహులపై ఆంక్షలు విధించారు. లాఠీలు ఝుళిపించారు. తొలుత బోర్సాద్ దాకే వెళ్లాలనుకున్న గాంధీజీ యాత్రను దండి దాకా పొడిగించారు. 24 రోజుల యాత్ర తర్వాత ఏప్రిల్ 6న గాంధీజీ దండి తీరంలో ఉప్పు చేతపట్టే సమయానికి.. అక్కడి మడుల్లో ఉప్పు లేకుండా చేశారు. ఉన్న కొద్దిపాటి ఉప్పును చేతుల్లోకి తీసుకొని గాంధీజీ శాసనోల్లంఘనకు పాల్పడ్డారు. 'ఈ ఉప్పుతో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కూకటివేళ్లతో పెకలించబోతున్నాను' అంటూ ప్రకటించారు. అయితే గాంధీజీ చర్యను ఆంగ్లేయ సర్కారు గుర్తించటానికి నిరాకరించింది. ఆయన చేతబట్టిన ఉప్పు అసలు సామాన్యులు వాడటానికి ఏమాత్రం ఉపయోగపడనిదని.. కాబట్టి అది ఉల్లంఘన కిందికే రాదన్నారు. కొద్దిరోజుల తర్వాత అర్థ రాత్రి గాంధీజీని అరెస్టు చేసి లారీలో తరలించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు అబ్బాస్ త్యాబ్జీ, సరోజినీ నాయుడు తదితరులు ఉద్యమానికి ఒకరితర్వాత మరొకరు నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రభుత్వ ఉప్పు డిపోలపై ఉద్యమకారులు దాడులు చేసి ఉల్లంఘనకు పాల్పడ్డారు. బ్రిటిష్ సర్కారు వారిపై దారుణంగా దాడులు చేసినా చివరకు తలవంచింది. తీరప్రాంతాల సమీపంలో భారతీయులు ఉప్పు తయారు చేసుకోవటానికి వైస్రాయ్ ఇర్విన్ అనుమతించారు.
ఇదీ చూడండి: బ్రిటీష్‌వారు హేళన చేసినా.. ఆ విషయంలో మనదైన ముద్ర!