Azadi Ka Amrit Mahotsav: స్వామి వివేకానంద ఏడుగురు సోదరుల్లో చిన్నవాడైన భూపేంద్రనాథ్ 1880 సెప్టెంబరు 4న జన్మించారు. 1905 బెంగాల్ విభజనతో బెంగాల్ అంతటా విప్లవవాదం ఊపందుకుంది. భూపేంద్రనాథ్‌పైనా ఆ ప్రభావం పడింది. విప్లవవాద సంస్థ అనుశీలన్ సమితి పత్రిక జుగాంతర్‌లో వ్యాసాలకుగాను 1907 జులైలో భూపేంద్రనాథ్‌కు రాజద్రోహ నేరం కేసులో ఏడాది జైలు శిక్ష పడింది.
జైలు నుంచి బయటకు రాగానే ఆయన్ను మళ్లీ అరెస్టు చేసే అవకాశం కన్పించింది. ఈ సంగతి పసిగట్టిన వివేకానందుడి శిష్యురాలు సిస్టర్ నివేదిత భూపేంద్రనాథ్‌ను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. 1914 నాటికి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో పీజీ పూర్తి చేసిన భూపేంద్రనాథ్ ఆలోచనలు విస్తృతమయ్యాయి. అక్కడే భారత స్వాతంత్య్రం కోసం ఏర్పడ్డ గదర్‌పార్టీతో పరిచయాలయ్యాయి. అదే సమయానికి... మొదటి ప్రపంచ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ అవకాశాన్ని భారత స్వాతంత్య్రానికి అనుకూలంగా మలచుకోవాలని ఐరోపాలోని భారత విప్లవవాదులు ప్రణాళికలు రచించసాగారు. వారికి జర్మనీ ప్రభుత్వ సహకారం కూడా లభించింది. ఫలితంగా చంపక్ రామన్‌పిళ్లై, వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ తదితరులతో ఏర్పడింది బెర్లిన్ కమిటీ. గదర్‌పార్టీతో ఈ బెర్లిన్ కమిటీ సంప్రదింపులు మొదలయ్యాయి. జర్మనీ సాయంతో భారత్‌లో బ్రిటిష్ సర్కారుపై సాయుధ పోరాటం చేయాలనుకున్నారంతా. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓడిపోవటంతో వీరి ప్రయత్నాలన్నీ నిర్వీర్యమైపోయాయి.
ఇంతలో 1917 బోల్షివిక్ విప్లవంతో సోవియట్ యూనియన్‌లో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టులు వీరికి ఆశాకిరణంలా కనిపించారు. అదే సమయంలో ఎంఎన్ రాయ్ (మొదటి పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య) భారతీయ కమ్యూనిస్టు పార్టీకి రూపకల్పన చేశారు. సోవియట్ నేతల ఆహ్వానం మేరకు అనేక మంది విప్లవవాదులు 1921లో మాస్కో చేరుకున్నారు. అక్కడే భారత్‌లో కమ్యూనిస్టు పంథా, జాతీయోద్యమంలో పాత్రపై విభేదాలు తలెత్తాయి. అప్పటికే సాగుతున్న జాతీయోద్యమాన్ని కలుపుకొని వెళ్లాలని భూపేంద్రనాథ్ వాదించగా... వారిని బూర్జువా వర్గంగా దూరం పెట్టాలన్నారు రాయ్. మార్క్సిజానికి ఆకర్షితుడైనా... గాంధీ నాయకత్వంలో ప్రజాయుద్ధంగా మారుతున్న జాతీయోద్యమాన్ని భూపేంద్రనాథ్ ఎన్నడూ తక్కువ అంచనా వేయలేదు. సామాన్యులను, రైతులను, కార్మికులను క్రమంగా ఈ ఉద్యమంలో క్రియాశీలకం చేస్తే విజయం చేకూరుతుందని ఆయన బలంగా నమ్మారు.
భారత్‌లో సామాన్యులు శక్తిమంతులు కావాలని, సోషలిజం నెలకొనాలని కృషి చేసిన ఆయనకు దురదృష్టవశాత్తు రావల్సినంత పేరు రాలేదు. ఆయనా ఆశించలేదు. స్వాతంత్య్రం వచ్చాక బెంగాల్‌లోని తమ పాత ఇంట్లో కిరాయిదారులు పెట్టిన తిండి తింటూ వారితో కలసి ఉండేవారు. స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛన్‌ను కూడా నిరాకరించి నిరాడంబరంగా... జీవించిన ఈ సామాజిక విప్లవకారుడు 1961లో తన 81వ ఏట కన్నుమూశారు.
జాతీయోద్యమానికి సోషలిజాన్ని అద్ది
1924లో డాక్టరేట్ పూర్తి చేసుకొని 16 సంవత్సరాల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన భూపేంద్రనాథ్ కమ్యూనిస్టు పార్టీలో చేరకుండానే రైతులు, కార్మికులను కూడగట్టడం మొదలెట్టారు. జాతీయోద్యమానికి సోషలిస్టు దృక్పథాన్ని అద్దటానికి నిరంతర కృషి చేశారు. సమస్యలను, చరిత్రను మార్క్సిస్టు కోణంలో విశ్లేషించాలని చెబుతూనే... మార్క్సిస్టేతరుల పరిశోధనలను బూర్జువా వాదనగా కొట్టిపారేయవద్దని హితవు చెప్పారు. సోషలిస్టు యూత్ కాంగ్రెస్‌లో కీలక సభ్యుడిగా నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌లతో కలసి పనిచేశారు. భూపేంద్రనాథ్ చొరవతో దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు సమ్మెలతో సాగుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి కంటగింపుగా మారాయి. 1931 కరాచీ కాంగ్రెస్ సదస్సులో ప్రాథమిక హక్కులపై కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానం భూపేంద్రనాథ్‌దే. 1943 బెంగాల్ క్షామంలో నిధులు సమీకరించటంతో పాటు సామాజిక వంటశాలలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఆదుకున్నారు. భారత కమ్యూనిస్టులు స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, పేదలు, రైతులు, కార్మికుల మేలుకు అంతా కలసి పనిచేయాలని ఆయన వాదించేవారు. బెర్లిన్ కమిటీ ఆధారంగా... భారత ద్వితీయ స్వాతంత్య్ర సంగ్రామం, అప్రకాశిత రాజనీతి ఇతిహాస్‌లాంటి పుస్తకాలతో పాటు భారత సమాజం, చరిత్ర, కళలు, వివేకానందుడిని మార్క్సిస్టు దృక్కోణంలోంచి విశ్లేషించిన తొలితరం బుద్ధిజీవి భూపేంద్రనాథ్!
ఇదీ చూడండి: