ETV Bharat / bharat

బ్రిటీష్​వారు హేళన చేసినా.. ఆ విషయంలో మనదైన ముద్ర! - బ్రిటీష్​ పాలనలో ఓటు హక్కు

Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య్ర వేళ.. దేశంలో ఎటు చూసినా నిరక్షరాస్యత, అసమానత, అంటరానితనం, వెనకబాటుతనం, పేదరికం! ఇలాంటి జనాభాలో బాగా ఆలోచించి ఓటు వేయగలవారు ఎంతమందనేదే ప్రతి ఒక్కరిలోనూ తలెత్తిన సందేహం! అందుకే ఆంగ్లేయ సర్కారు 'అందరికీ ఓటు.. భారత దేశానికి నప్పదు' అని తేల్చిచెప్పింది. ఆంగ్లేయులెంతగా వద్దన్నా.. భారత  రాజ్యాంగ నిర్మాతలు మాత్రం తొలి రోజు నుంచే అందరికీ ఓటు హక్కునిచ్చారు. మన ప్రజల అక్షర జ్ఞానం కంటే ఇంగితజ్ఞానానికి పెద్దపీట వేశారు!

Azadi Ka Amrit Mahotsav
Azadi Ka Amrit Mahotsav
author img

By

Published : Mar 11, 2022, 8:59 AM IST

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులు వెళ్లిపోయినా స్వాతంత్య్రానంతరం కూడా అనేక వలస పాలన పద్ధతులు కొనసాగాయి. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా మనదైన సొంత ముద్ర వేసుకున్నవాటిలో బలమైనది ఏమైనా ఉందంటే అది- అందరికీ ఓటు హక్కు! ఆంగ్లేయుల పాలనలోనూ భారత్‌లో ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటిలా అర్హులైన అందరికీ ఓటు హక్కు ఉండేది కాదు. 'భారత్‌లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు, గ్రామీణులు కూడా. వీరందరికీ ఆలోచించి ఓటు వేసే నిర్ణయాత్మక శక్తి లేదు. భారత్‌లో అందరికీ ఓటు అనేది సరిపోదు' అంటూ.. ఎంపిక చేసిన కొంతమందినే బ్రిటిష్‌ సర్కారు ఓటు వేయటానికి అర్హులుగా నిర్ణయించింది. ఆస్తి ఉన్నవారు, చదువుకున్న వారు, ఆస్తిపన్ను, ఆదాయ పన్ను కట్టేవారికి మాత్రమే ఓటు హక్కు ఇచ్చారు. తొలుత మహిళలను కూడా విస్మరించారు. నాగరికులం, ఆధునికులం అని తమకు తాము కితాబిచ్చుకున్న బ్రిటన్‌లోనూ ఇదే పరిస్థితి. తొలిసారిగా 1918లో బ్రిటన్‌ చట్టసభలోకి మహిళ అడుగుపెట్టినప్పుడు విన్‌స్టన్‌ చర్చిల్‌ అవహేళన చేశాడు.

మహిళా సంఘాల డిమాండ్లు, పోరాటాలకు తలొగ్గి 1919నాటి భారత చట్టంలో కొంత వెసులుబాటునిచ్చారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకే మహిళలకు ఓటు హక్కునిచ్చే అవకాశం కల్పించారు. అలాగని మహిళలందరికీ ఓటు రాలేదు. మళ్లీ అందులోనూ సంపన్న వర్గాల వారికే పరిమితమైంది. 1935 బ్రిటిష్‌ ఇండియా చట్టంలో మరింత వెసులుబాటు ఇవ్వటంతో.. జనాభాలో ఐదో వంతు మందికి ఓటు హక్కు లభించింది. ఒడిశా, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో మహిళా ఓటర్లను తగ్గించారు. విడాకులు తీసుకున్నా, భర్త చనిపోయినా, ఆస్తి పోయినా వారిని ఓటర్ల జాబితాలోంచి తొలగించేవారు. మద్రాసులాంటి చోటేమో పింఛన్‌ పొందే వితంతువులు, ప్రభుత్వాధికారుల, సైనికుల తల్లులు, పన్ను చెల్లింపుదారులైన జీవిత భాగస్వాములకు ఓటు ఇచ్చారు. అలా మగవారి స్థాయిపై మహిళల ఓటు ఆధారపడి ఉండేది.

భారత రాజ్యాంగ సభ రాజ్యాంగ నిర్మాణంలో చాలామటుకు 1935నాటి చట్టాన్ని అనుసరించినా.. ఓటు హక్కు విషయంలో మాత్రం తనదైన ముద్రవేసింది. స్వతంత్ర దేశంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించాలని తీర్మానించింది. ఈ నిర్ణయం అల్లాటప్పాగానో, ప్రచారం కోసమో, ఆడంబరంగానో తీసుకున్నది కాదు. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ప్రజలందరికీ అందులో భాగస్వామ్యం ఉండాలని, తమ అభిప్రాయాన్ని వ్యక్తంజేసే హక్కు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకే ఎన్నో అవరోధాలున్నా అందరికీ ఓటు హక్కు అనే విప్లవాత్మక నిర్ణయాన్ని బాధ్యతతో, ప్రజాస్వామ్య స్పృహతో ప్రవేశపెట్టారు.

కులం, మతం, ప్రాంతం, అక్షరాస్యత, ఆడా మగ లాంటి వివక్షలతో సంబంధం లేకుండా దేశంలో 21 ఏళ్లు నిండినవారందరికీ (1988లో దీన్ని 18 ఏళ్లకు తగ్గించారు) ఓటు హక్కు కల్పించారు. భారత పౌరులు కాకముందే మన దేశవాసులు ఓటర్లయ్యారు. దీంతో స్వతంత్ర భారతంలో ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా ఐదింతలు (17.3 కోట్ల మంది) పెరిగింది. నాటి జనాభాలో దాదాపు సగంమందికి ఓటు హక్కు వచ్చింది. వారిలో 8 కోట్ల మంది మహిళలుండటం విశేషం. 85శాతం మంది అంతకుముందు ఎన్నడూ ఓటు అంటే తెలియని వారే. ఈ సంఖ్య ఇంకా పెరిగేది. కానీ దాదాపు 30 లక్షల మంది తమ పేర్లు వెల్లడించటానికి ఇష్టపడని కారణంగా జాబితాలో చేరలేకపోయారు.

1895 నుంచే..: నిజానికి.. ఇంకా స్వాతంత్య్ర నినాదం ఊపందుకోని వేళ.. 1895లోనే స్వరాజ్య బిల్‌ అంటూ భారత రాజ్యాంగ ముసాయిదా తయారైంది. దీన్ని ఎవరు రాశారనేది తెలియకున్నా.. బాలగంగాధర్‌ తిలక్‌ రాసినట్లు అనిబీసెంట్‌ అనేవారు. ఇందులోనే.. భావప్రకటనా స్వేచ్ఛ, ఆస్తి హక్కులతో పాటు అందరికీ ఓటు హక్కును కూడా ప్రతిపాదించారు. 1928 నెహ్రూ కమిటీ నివేదికలో కూడా అందరికీ ఓటు హక్కును డిమాండ్‌ చేశారు. మొత్తానికి స్వతంత్ర భారతావని ఎలాంటి చర్చలకు, ఆలోచనలకు తావు లేకుండా.. తొలినాటి నుంచే అందరికీ ఓటు హక్కునిచ్చింది. బ్రిటిష్‌ వారు వద్దంటున్నా వినకుండా ధైర్యంగా అడుగు వేసింది. భారత ప్రజానీకం కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టారు.. నిలబెడుతూనే ఉన్నారు.

ఇదీ చూడండి: ఆయన జైల్లో ఉన్నా 'ఆంగ్లేయులు' వణికిపోయారు.. ఆ భయంతోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.