స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో 1898 మార్చి 3న అథల్సే, చెర్తా షోలింగర్ దంపతులకు మెల్లీ షోలింగర్ జన్మించారు. హోంసైన్సులో డిగ్రీ చేసి, వైద్యవిద్యను రెండేళ్లు అభ్యసించాక ఆర్థిక సమస్యలతో మధ్యలోనే ఆపేశారు. మెల్లీకి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలు ఎక్కువ. స్విట్జర్లాండ్‌లో స్త్రీలకు ఓటు హక్కు కల్పించాలని ప్రదర్శనలు నిర్వహించారు. కార్మికులు పనిచేసే కాలాన్ని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచినప్పుడు జరిగిన నిరసనల్లోనూ పాల్గొన్నారు. అనంతరం జర్మనీలోని ట్యూబెన్‌గెన్ నగరంలోని తన స్నేహితులను కలిసేందుకు వెళ్లారు. అక్కడే ఉప్పల లక్ష్మణరావుతో పరిచయమైంది. అప్పటికే భారతదేశ చరిత్ర, వేదాలు, బౌద్ధమత గ్రంథాలను చదివిన మెల్లీకి మనదేశంపై వల్లమాలిన అభిమానం పెరిగింది. మన సంస్కృతిని దగ్గరగా పరిశీలించేందుకు భారత్ రావాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆంగ్లేయ ప్రభుత్వం ఆమెకు రెండుసార్లు అనుమతి నిరాకరించింది. చివరికి వ్యాపారం చేస్తానని అర్జీ పెట్టుకుని 1929లో తన కలల దేశంలోకి అడుగుపెట్టారు.
అరెరె.. ఇలా ఉందేంటి?: ఎంతో ఉత్సాహంగా వచ్చిన మెల్లీ.. ఇక్కడి వాస్తవ పరిస్థితులను చూసి తల్లడిల్లారు. తాను పుస్తకాల్లో చదివిన వైభవం స్థానంలో బానిసత్వం, కడు పేదరికం ఉండడానికి ఆంగ్లేయుల దమననీతే కారణమని గుర్తించారు. ప్రజా పోరాటంలో నేరుగా పాల్గొనేందుకు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. జర్మనీలోని ఉప్పల లక్ష్మణరావు సూచన మేరకు రాజమహేంద్రవరం చేరుకోగా అక్కడ దామెర్ల రామారావు, దిగుమర్తి సరస్వతి-గోపాలస్వామి వంటి దేశభక్తుల కుటుంబాలతో పరిచయమైంది. వారి ప్రభావంతో ఖద్దరు ధరించడం ప్రారంభించారు. అదే ఏడాది లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు రైలులో రాజమహేంద్రవరం నుంచి వెళ్లారు. గాంధీ, నెహ్రూల ప్రసంగాలతో ఉత్తేజితులయ్యారు. లాహోర్ నుంచి వచ్చాక ప్రదర్శనలు, సమావేశాలు ఎక్కడ జరిగినా హాజరవడం ప్రారంభించారు.
మూడుసార్లు జైలుకెళ్లిన యోధురాలు: మెల్లీని ఉప్పు సత్యాగ్రహం అమితంగా ఆకట్టుకుంది. ఆమె విజయవాడకు చెందిన పాదర్తి సుందరమ్మ, పెరంబుదూరు సుభద్రమ్మతో కలిసి మచిలీపట్నం సముద్రతీరంలో ఉప్పును తయారు చేశారు. పొట్లాలు కట్టి, విక్రయించగా వచ్చిన డబ్బును కాంగ్రెస్‌కు విరాళమిచ్చారు. విదేశీ వస్త్రాలు, వస్తువులను విక్రయించే దుకాణాల ఎదుట ఖాదీ నిక్కరు, చొక్కాలను ధరించి ధర్నాలు చేశారు. ఆమె విదేశీయురాలు కావడంతో అరెస్టు చేయడానికి పోలీసులు భయపడేవారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఏడాదిపాటు ఉన్నారు. అక్కడ నూలు వడకటం నేర్చుకున్నారు. ఆశ్రమానికి రాత్రివేళల్లో కాపలా కాసే బాధ్యతను మహిళలకు సైతం అప్పగించాలని గాంధీజీని ఒప్పించారు. అక్కడే మెల్లీకి పొట్టి శ్రీరాములుతో పరిచయమైంది.
సబర్మతి నుంచి తిరిగొచ్చాక.. శ్రీకాకుళంలో మూడేళ్లు ఉండి, సన్నని నూలు తయారు చేయడాన్ని, కోడూరు, బొంతల కోడూరు గ్రామాల్లో పట్టు, జరీలతో అతి సన్నని ఖాదీ వస్త్రాల తయారీని నేర్చుకున్నారు. ఇక్కడి నేతకారుల ప్రతిభను గాంధీజీకి లేఖల్లో వివరించారు. దంతులూరి లక్ష్మీనరసింహం కొత్తతరం రాట్నం ఆవిష్కరించగా.. దానిని మద్రాసు ప్రావిన్సులో ప్రచారం చేశారు. తండ్రికి అనారోగ్యం కారణంగా 1934లో స్వదేశం వెళ్లారు. మాస్కోలో 1937 ఆగస్టు 30న ఉప్పల లక్ష్మణరావును పెళ్లాడిన మెల్లీ భారత్‌కు తిరిగొచ్చి, విజయవాడలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో 1940లో వ్యక్తిగత సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారు. మొత్తంగా మూడున్నరేళ్లు రాయవెల్లూరులో జైలుశిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన క్షణాన మెల్లీ అమితంగా సంతోషించారు. తన సోదరులను చూడటానికి 1957లో జర్మనీకి వెళ్లి, అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారతావని గడ్డపైనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరిక తీరకపోవడం విషాదం.
ఇవీ చదవండి: వ్యాపారమే కాదు.. బ్రిటిష్‌పై పోరాటంలోనూ ముందున్న 'బిర్లా'
బ్రిటిష్ జగన్నాటకం.. పూరీ జగన్నాథ ఆలయంపైన ఆధిపత్యానికి విఫలయత్నం