ETV Bharat / bharat

వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి.. తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలి..

ఇంగ్లండ్‌లో స్వామి వివేకానందుడి ప్రసంగాలను విన్న ఓ యువతి తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలేసింది. ఆయన వెంట నడిచి పుణ్యభూమిపై అడుగిడింది. భారత్‌నే ఆత్మీయ దేశంగా తలచింది. విశాల హితంతో స్వాతంత్య్ర పోరాటానికి ఆలంబనగా నిలిచింది. భరతమాత చిత్రపటానికీ రూపమిచ్చింది. విదేశీ పాలనలో కొడిగడుతున్న భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు పుస్తకాలను రచించింది. ఆమే.. మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌.. అలియాస్‌ సిస్టర్‌ నివేదిత.

margaret elizabeth noble
మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌
author img

By

Published : Jul 21, 2022, 7:47 AM IST

మార్గరెట్‌ ఎలిజబెత్‌ నోబెల్‌ ఐర్లాండ్‌లో 1867 అక్టోబరు 28న జన్మించారు. తండ్రి జాన్‌ నోబెల్‌ స్థానిక చర్చి ఫాదర్‌. తండ్రి పేదల దగ్గరికి వెళ్లినప్పుడల్లా ఆమె ఆయన వెన్నంటి ఉండేది. తండ్రి కరుణామయ స్వభావం, తల్లి సేవాగుణం ఆమెలో మానవతా పరిమళాలు నింపాయి. పదిహేడేళ్ల వయసులోనే పాఠశాలలో, అనాథ సదనంలో ఉపాధ్యాయినిగా పనిచేశారు. 1895లో లండన్‌లో లేడీ మార్గెస్సన్‌ నివాసంలో ఆమె తొలిసారి స్వామి వివేకానందుణ్ని కలిశారు. ఆయన ప్రసంగాన్ని విన్నారు. 'దేశీయ విద్యావిధానం.. దేశీయత, ఆధ్యాత్మిక స్పర్శతో ఉండాలి. మాతృభూమితో అనుసంధానం కావాలి’ అన్న వివేకానందుని బోధనలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. స్వామి ఉపన్యాసానికి ప్రభావితురాలైన మార్గరెట్‌... భారత్‌లో చదువు చెప్పి, అక్కడి సమాజంలో పరివర్తన తీసుకురావాలని తలపోశారు. వెంటనే సన్యాసం స్వీకరించి, ఆయన శిష్యురాలయ్యారు. రామకృష్ణ మిషన్‌లో చేరారు. 'నివేదిస్తూ, దైవానికి అంకితం కావడం' అనే అర్థంలో వివేకానందుడు ఆమె పేరును నివేదితగా మార్చారు. 1898 జనవరిలో ఆమె భారత్‌ వచ్చేశారు. ఇక్కడ ఆంగ్లేయుల పాలనను చూసి, ఆమె హృదయం రగిలింది. వారి దుష్పరిపాలన కింద ప్రజల బతుకులు ఎలా అణగారిపోతున్నాయో వివరిస్తూ తన స్నేహితులకు ఉత్తరాలు రాశారు.

బాలికా విద్య, పేద రోగుల సేవలో జీవితాన్ని గడపాలని నిర్ణయించి కోల్‌కతాలోని బాగ్‌బజారులో రామకృష్ణ మిషన్‌-సిస్టర్‌ నివేదిత పాఠశాలను నెలకొల్పారు. దీన్ని శారదామాత స్వయంగా ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి బాలికలను పాఠశాలలో చేర్పించారు. బడిలో వందేమాతరాన్ని ప్రార్థనా గీతంగా ప్రవేశపెట్టారు. బాల్యవివాహాల దురాచారాన్ని రూపుమాపేందుకూ పోరాడారు. 1902లో వివేకానందుడి హఠాన్మరణంతో నివేదిత తీవ్రంగా కుంగిపోయారు. క్రమంగా కోలుకున్నాక ఆమె దృక్పథం మారింది. ఒకవైపు సామాజిక సేవ కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయ ఉద్యమాల వైపు ప్రజలను కదిలించారు. గోపాలకృష్ణ గోఖలే, తీవ్రవాద భావాలున్న అరబిందో ఘోష్‌తో తరచూ మాట్లాడుతూ ఉద్యమ తీరును తెలుసుకునేవారు. కరవు నుంచి జాతి నిర్మాణం వరకు అనేక అంశాలపై పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. వివేకానందుడు, టాటాల కలల ప్రాజెక్టు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ను బెంగళూరులో నెలకొల్పేందుకు పట్టుదలతో శ్రమించారు.

భరతమాత చిత్రానికి ఆకృతినిచ్చి..: చేతిలో జెండా, నుదుట బొట్టు, ప్రశాంత వదనంతో కనిపించే భారతమాత చిత్రపటం రూపకల్పనలో నివేదిత పాలుపంచుకున్నారు. 1905లో బెంగాల్‌ విభజన సమయంలో ప్రజల ఐక్యత కోసం 'బంగమాత' చిత్రాన్ని వేయాలని నాటి వర్ణచిత్రకారుడు అవనీంద్రనాథ్‌ రాయ్‌ భావించారు. ఆయనకు భారతమాత ఆలోచననిచ్చి, ఆకృతికి నమూనా చిత్రాన్ని సైతం నివేదిత గీసిచ్చారు. దేశ స్వాతంత్రోద్యమంలో అప్పట్లో బెంగాల్‌ కీలకపాత్ర పోషించింది. అలాంటి సమయంలోనే రాష్ట్ర విభజనకు వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌ సిఫారసు చేయగా ప్రజలు తిరగబడ్డారు. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకుని, ఉవ్వెత్తున ఎగసింది. దేశాన్ని ఏకతాటిపై నడిపింది. ఆ సమయంలో బెంగాల్‌ గడ్డమీద అందరినీ జాగృతపరచడంలో సిస్టర్‌ నివేదిత ఎనలేని కృషి చేశారు. కోల్‌కతాతోపాటు పట్నా, లఖ్‌నవూ, వడోదరా, నాగ్‌పుర్‌, వార్ధా, అమరావతి, చెన్నైల్లో పర్యటించి ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించారు.

గురువు బాటలోనే అకాల మరణం: కోల్‌కతాలో 1898-99 మధ్యకాలంలో ప్లేగు వ్యాధి వ్యాపించిన వేళ చేసిన సేవలు నివేదిత ఆరోగ్యాన్ని కొంత దెబ్బతీశాయి. తూర్పు బెంగాల్‌ కరవు బాధితులకు సహాయక చర్యలు చేపట్టే క్రమంలో ఆమె డయేరియా బారిన పడ్డారు. ఇలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న సిస్టర్‌ నివేదిత 1911 అక్టోబరు 13న తన 44వ ఏట దార్జీలింగ్‌లో కన్నుమూశారు. భారత్‌లో 13 ఏళ్లు మాత్రమే గడిపినా.. మన దేశ ప్రజలు, సంస్కృతితో మమేకమయ్యారు. లక్షల మంది అభాగ్యులకు తన ఆత్మీయ స్పర్శతో అమృత దీవెన అందించారు.

ఇవీ చదవండి: రక్తం మరిగి.. గుండె రగిలి.. తెల్లవారిని వణికించిన పోరాట యోధుడు!

సైనికులపై ఆంగ్లేయుల వివక్ష.. ఎంత చేసినా అత్యున్నత హోదా సుబేదారే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.