వ్యాపారం కోసం భారత్‌కు వచ్చి... ఇక్కడి సొమ్ముతో బ్రిటన్‌లో సోకులు చేస్తూ... భారతీయులను బానిసలుగా చూసిన ఆంగ్లేయులు... తమను తాము అగ్రజాతిగా భావించేవారు. భారతీయులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేవారు. సంపన్నులైనా సరే భారతీయులంటే తమతో సమానం కాదనేవారు. అందుకే తమకోసం ప్రత్యేకమైన కాలనీలు, హోటళ్లు, సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమంలో వెలసిందే... ముంబయిలోని వాట్సన్ హోటల్. ఇంగ్లాండ్‌లోని రైతు కుటుంబంలో పుట్టి... 1853లో పరదాల వ్యాపారం కోసం ముంబయికి వచ్చిన జాన్ హడ్సన్ వాట్సన్ కుటుంబం... 1865కల్లా ఆతిథ్య రంగంలోకి దిగింది. ఇటుకలతో మొదలుకొని నిర్మాణ సామాగ్రి అంతటినీ ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకొని ముంబయిలోని కాలాఘోడా ప్రాంతంలో వాట్సన్ హోటల్‌ను కట్టారు. 1871లో ఆరంభమైన ఈ విలాసవంతమైన హోటల్‌లో కేవలం తెల్లవారికి మాత్రమే ప్రవేశం ఉండేది. ఈ హోటల్‌లో సిబ్బంది అంతా కూడా ఆంగ్లేయులే. "అన్నింటినీ ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్న వాట్సన్... ఇక్కడ పీల్చే గాలిని కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటే పోలా!' అని అప్పట్లో ఓ జోక్ కూడా ప్రచారంలో ఉండేది.
హోటల్ బయటే... 'కుక్కలు, భారతీయులకు ప్రవేశం లేదు' అని బోర్డు తగిలించి ఉండేదంటారు. అప్పటికే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి... బ్రిటిష్‌వారికి దీటుగా భారత్‌లో పరిశ్రమలను స్థాపించాలని చూస్తున్న జంషెడ్‌జీ రతన్‌జీ దాదాభాయ్ టాటా... ఓసారి వాట్సన్ హోటల్‌కు వెళ్లగా ఆయనకు చుక్కెదురైంది. కేవలం యూరోపియన్లకే ప్రవేశం పరిమితమనటంతో... అవమానంగా భావించిన టాటా... వెంటనే వాట్సన్‌ను మించిన హోటల్ నిర్మాణానికి తీర్మానించుకున్నారు. ఫలితమే... ముంబయిలోని ప్రతిష్ఠాత్మక తాజ్ హోటల్!
అతిథిదేవో భవ..
ముంబయిలోని కొలాబా ప్రాంతంలో... గేట్‌వే ఆఫ్ ఇండియాను ఆనుకొని 1898లో టాటా దీనికి శంకుస్థాపన చేశారు. భారతీయ ఇంజినీర్లు సీతారాం ఖండేరావు వైద్య, డి.ఎన్.మిర్జాలు దీనికి ప్రణాళిక ఇచ్చారు. ఆరోజుల్లో రెండున్నర లక్షల పౌండ్ల ఖర్చుతో నిర్మాణం పూర్తయిన ఈ భవంతి... 1903 డిసెంబరు 16న ఆతిథ్యానికి తలుపులు తెరచింది. ఆరంభం కాగానే... టాటా తీసుకున్న నిర్ణయం ఏంటంటే... తాజ్ హోటల్‌లో భారతీయులతో పాటు యూరోపియన్లకే కాదు ఏ దేశస్థులకైనా ప్రవేశం ఉంటుందని! ఎలాంటి
వివక్ష లేకుండా అందరినీ గౌరవిస్తామంటూ భారతీయ సంస్కారాన్ని చాటారు టాటా! భారత్‌లో భారతీయులు నిర్మించిన తొలి విలాసవంతమైన హోటల్‌గానే కాకుండా... విద్యుత్ సదుపాయంగల తొలి హోటల్‌గా; అమెరికా ఫ్యాన్లు, జర్మనీ లిఫ్ట్‌లు... ఇలా సకల సౌకర్యాలతో ఘనంగా ఆవిష్కృతమైంది తాజ్ హోటల్! 1903లో ఫ్యాన్, అటాచ్డ్ బాత్‌రూమ్ ఉన్న గదికి రూ.13 రూపాయలు వసూలు చేసేవారు. సకల సౌకర్యాలతో... తాజ్ హోటల్ ఆరంభం కాగానే... వాట్సన్ ప్రాభవం తగ్గిపోవడం విశేషం. భారత్‌కు వచ్చే అనేక మంది యూరోపియన్లు సౌకర్యాలు, ఆతిథ్యం చూసి... వాట్సన్ కంటే కూడా తాజ్‌నే ఎంచుకునేవారు. అలా... ప్రఖ్యాత ఆంగ్ల రచయిత, ఇంగ్లాండ్ సీక్రెట్ ఏజెంట్ సోమర్‌సెట్ మామ్ నుంచి లార్డ్ మౌంట్‌బాటన్ దాకా అంతా ఇక్కడ ఉండటానికే ఇష్టపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో... ఈ హోటల్‌ను ఆసుపత్రిగా మార్చారు. 600 పడకల మిలిటరీ ఆసుపత్రిగా బ్రిటిష్ ప్రభుత్వం వాడుకుంది.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులపై తెల్లోడి తిరుగుబాటు