'ధూమపానం ఆరోగ్యానికి హానికరం' ఈ విషయం అందరీకీ తెలుసు. అయినా కూడా సిగరెట్ తాగకుండా ఉండలేరు చాలా మంది. అతి బలవంతాన మానేసినా.. కొద్దిరోజులకే మళ్లీ పొగపీల్చడం మొదలెట్టే పొగరాయుళ్లు ఎంతో మంది ఉంటారు. అనేక జబ్బులకు దారి తీసే ఈ వ్యసనాన్ని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. మరి సిగరెట్ తాగినా.. ఆరోగ్యానికి ఏ మాత్రం నష్టం చేకూర్చకుండా(Helathy cigerette) ఉంటే... ఎంతో బాగుంటుంది కదా? ఇదే విషయాన్ని ఆలోచించిన మహారాష్ట్రకు చెందిన ఓ ఆయుర్వేద సంస్థ.. ప్రత్యేకమైన సిగరెట్‌ను అభివృద్ధి చేసింది. పదేళ్ల క్రితం తయారు చేసిన ఈ ఆయుర్వేదిక్ సిగరెట్‌కు ఇప్పుడు 'ఇండియన్ పేటెంట్' హక్కులు అందాయి.
పుణెకు చెందిన అనంత్‌వేద ఆయుర్వేద సంస్థ(Anantveda ayurvedic ).. ఈ ఆయుర్వేద సిగరెట్‌ను అభివృద్ధి చేసింది. ధూమపానానికి అలవాటు పడిన వారికి.. ఈ ఆయుర్వేద సిగెరట్ ఓ వరం లాంటిదని అనంత్‌వేద ఆయుర్వేద సంస్థకు చెందిన వైద్యుడు డాక్టర్ రాజస్ నిత్సురే పేర్కొన్నారు.
ఎలా తయారు చేస్తారంటే..?
మామాలు సిగరెట్లలో పొగాకును వినియోగిస్తారు. పొగాకులో ఉండే నికోటిన్.. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే.. అనంత్‌వేద ఆయుర్వేద సంస్థ తయారు చేసిన ఈ ఆయుర్వేదిక్ సిగరెట్లో మాత్రం పొగాకు ఉండదు. అందులో తులసి, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి వాడుతారు. దీన్ని పీల్చితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం(ayurvedic cigarette benefits) అని తయారీదారులు చెబుతున్నారు.
మూడు తరాల కృషి..
ఈ ఆయుర్వేద సిగరెట్‌పై డాక్టర్ అనంత్ నిత్సురే ఆయన తనయుడు డాక్టర్ ఉదయ్ నిత్సురే పరిశోధనలు చేసి.. పదేళ్ల క్రితం అభివృద్ధి చేశారు. అనంత్ నిత్సురే మనవడు డాక్టర్ రాజేశ్ నిత్సురే ఈ సిగరెట్‌కు పేటెంట్‌ను పొందే ప్రక్రియను పూర్తి చేశారు.
"భారత ఆయుర్వేద వైద్యంలో ధూమపానం ఎప్పటినుంచో వినియోగంలో ఉంది. దీని ద్వారా... దగ్గు, గొంతుకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. ఛాతీ, ఊపిరితిత్తులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు దూరమవుతాయి."
-డాక్టర్ రాజేశ్ నిత్సురే, ఆయుర్వేద వైద్యుడు.
ఇదీ చూడండి: సెల్ టవర్ ఎక్కి టీచర్ ఆందోళన.. ఎందుకంటే?
ఇదీ చూడండి: కాన్వాస్‌పై బాడీతో పెయింటింగ్- ఉదయనిధి స్టాలిన్‌కు వినూత్న శుభాకాంక్షలు