Ayurveda treatment to tree: దశాబ్దాలుగా ఎంతోమందికి నీడతో పాటు స్వచ్ఛమైన గాలినిచ్చిన మహావృక్షం ఇది. కేరళ పథానంతిట్టలో రోడ్డు పక్కనే ఉన్న 130 ఏళ్ల రావిచెట్టుపై ఇటీవల కొంతమంది దుండగులు దాడి చేశారు. వేర్ల దగ్గర డ్రిల్లింగ్ యంత్రాలతో చెట్టుకు పెద్ద పెద్ద రంద్రాలు పెట్టి పాదరసం పోశారు. విషయం తెలుసుకున్న వృక్ష వైద్యులు దానికి పునరుజ్జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక ఔషధాన్ని తయారు చేశారు. ఇందులో దాదాపు 20 రకాల పదార్థాలను ఉపయోగించారు. బిను వజూర్, గోపకుమార్ కంగజ, నిధిన్ కురుప్పాడ, విజయ్ కుమార్ ఇథిథానం కలిసి చెట్టుకు వైద్యం చేశారు.
![Ayurveda treatment to Kerala tree in order to get rid of mercury poisoning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15574406_3.jpg)
వీరు తయారు చేసిన ప్రత్యేక ఔషధంలో చెట్టు పునాది నుంచి తీసిన నాలుగు కుండల మట్టి, పాలు, ఆవు పేడ, బియ్యపు పిండి, నెయ్యి, నల్ల నవ్వులు, అరటిపండు, తేనె వంటి 20 రకాల పదార్థాలున్నాయి. ఈ మిశ్రమాన్ని చెట్టు కాండానికి పూశారు. అనంతరం అది అతుక్కుని ఉండేలా 20 మీటర్ల కాటన్ వస్త్రాన్ని ఫ్లాక్స్ ఫైబర్ తీగలతో గట్టిగా చుట్టారు. ఆరు నెలల పాటు ఇది ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ఫలితం కన్పిస్తుందని వృక్ష వైద్యుల బృందం తెలిపింది.
![Ayurveda treatment to Kerala tree in order to get rid of mercury poisoning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15574406_2.jpg)
ఈ వైద్య బృందంలో ఒకరైన బిను వజూర్ ఈటీవీ భారత్తో మాట్లాడారు. సామాజిక అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అలుపెరగని కృషి వల్లే ఇలాంటి నీడనిచ్చే మహావృక్షాలు రోడ్డుపక్కన ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వైద్యం ఇంతకుముందు పనిచేసిందని, ఈ సారి కూడా సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
![Ayurveda treatment to Kerala tree in order to get rid of mercury poisoning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15574406_4.jpg)
ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గాడిదల పెంపకం.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు!