Ayodhya Ram Mandir Construction : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరం వచ్చే జనవరిలో భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. సంక్రాంతి పర్వదినం (జనవరి 14) నుంచి జనవరి 24 వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పది రోజుల పాటు వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 24నే భక్తులకు ఆలయంలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. మూడంతస్తుల్లో రూపుదిద్దుకుంటున్న రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తైందని మిశ్ర వెల్లడించారు. గర్భగుడి ప్రధాన ద్వారంతో పాటు 161 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురానికి స్వర్ణతాపడం చేయించనున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ ప్రక్రియను మకర సంక్రాంతికి ప్రారంభించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు.
Ram Mandir inauguration : విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 14న ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచాంగంలో మంచి గడియలను చూసి ఈ తేదీని ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు జ్యోతిషులు నాలుగు తేదీలను సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 21, 22, 24, 25 తేదీలు రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమని తేల్చినట్లు వెల్లడించాయి. ఇందులో జనవరి 22 మరింత పవిత్రమైన రోజు అని, అదే రోజు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
మోదీకి ఆహ్వానం
విగ్రహ ప్రతిష్ఠాపనకు విచ్చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పలకనున్నట్లు తెలుస్తోంది. గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే క్రతువుకు హాజరు కావాలని ట్రస్ట్ అధికారులు మోదీని కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకం చేసిన ఆహ్వాన లేఖను ప్రధాని మోదీకి పంపిస్తామని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ఠకు తేదీలు ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తన పర్యటనకు అనుకూలంగా ఉండే తేదీ చెప్పాలని ప్రధాని మోదీని కోరుతూ లేఖ రాస్తామని పేర్కొన్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి 26 మధ్య అనుకూలంగా ఉండే తేదీ కోసం మోదీని సంప్రదిస్తామని చెప్పారు.
మరోవైపు, గర్భగుడిలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని ముగ్గురు శిల్పులు వేర్వేరుగా చెక్కుతున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మూడు వేర్వేరు శిలలను వీరు విగ్రహాలుగా మలుచుతున్నారని చెప్పారు. అందులో ఆకర్షణీయంగా ఉండే విగ్రహాన్ని ఎంపిక చేసి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తామని స్పష్టం చేశారు. గణేశ్ భట్, అరుణ్ యోగిరాజ్ అనే శిల్పులు కర్ణాటక నుంచి శిలలను చెక్కుతున్నారని చంపత్ రాయ్ తెలిపారు. అత్యంత నాణ్యత కలిగిన మాక్రానా శిలను రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ్ పాండే.. విగ్రహంగా మలుస్తున్నారని వివరించారు. అయోధ్యలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో వీరు పని చేస్తున్నారని చెప్పారు. పటిష్ఠ భద్రత కలిగిన ఆ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులెవరినీ అనుమతించడం లేదని తెలిపారు.