Axis Bank Robbery Raigarh : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో మంగళవారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. నగరంలోని జగత్‌పుర్ యాక్సిక్ బ్యాంక్‌లోని రూ. 7 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. బ్యాంక్ సిబ్బందిని గదిలో వేసి బంధించి.. లాకర్లోని సొమ్ముతో పరారయ్యారు. అడ్డుకోబోయిన బ్యాంక్ మేనేజర్‌ను గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
Raigarh Bank Robbery News Today : రాయ్‌గఢ్‌లోని యాక్సిక్ బ్యాంక్ జగత్‌పుర్ శాఖలో ఈ దొంగతనం జరిగింది. ఉదయం 9.30 గంటల సమయంలో ఉద్యోగులు బ్యాంక్‌ను తెరిచి.. కార్యకలపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏడుగురు గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. కత్తితో బెదిరించి బ్యాంక్ మేనేజర్‌ను లాకర్ తాళం ఇవ్వాలని అడిగారు. దీనికి మేనేజర్ అంగీకరించకపోవడం వల్ల అతడి తొడపై గాయం చేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని.. సెక్యూరిటీ గార్డు సహా బ్యాంక్ ఉద్యోగులను ఓ గదిలో వేశారు. అనంతరం లాకర్ గదిలోకి వెళ్లి రూ. 7 కోట్ల నగదు, రూ.కోటిన్నర విలువైన బంగారాన్ని బ్యాగులో పెట్టుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బ్యాంక్ ఉద్యోగులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సీసీటీవీ కెమెరా దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన బ్యాంక్ మేనేజర్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
"ఎంత నగదు దొంగతనం జరిగిందో లెక్కిస్తున్నాం. ఇది పక్కా ప్రణాళికతో.. ప్రొఫెషనల్ ముఠాలు చేసిన పనిగా భావిస్తున్నాం. ఈ దొంగతనంలో ఏడుగురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫేక్ నంబర్ ప్లేట్ కలిగిన ఓ బైక్ లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల చెకింగ్ పాయింట్లను అప్రమత్తం చేశాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం."
--అజయ్ యాదవ్, ఐజీ బిలాస్‌పుర్
బాంబుతో బెదిరించి బ్యాంకు చోరీ.. రూ.24 లక్షలు దోచుకెళ్లిన ముసుగు దొంగ