international flights ban: అంతర్జాతీయ విమానాలను డిసెంబర్ 15 నుంచి పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ. కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
" కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. విమానాల పునరుద్ధరణకు సంబంధించి స్పష్టమైన తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. "
- డీజీసీఏ.
కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020, మార్చి 23 నుంచి నిలిపివేసింది భారత్. ఇటీవల కోవిడ్ ఉద్ధృతి తగ్గగా.. డిసెంబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అనుమతించాలని గత నెలలో నిర్ణయించింది. అయితే.. తాజా నిర్ణయంతో మరిన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రధాని సమీక్ష..
ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 27న సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల సడలింపును పునఃసమీక్షించాలని ప్రధాని సూచించారు. మరుసటి రోజునే ప్రయాణ ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మోదీ సూచనల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
భారత్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు అధికారులు.
పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి జోతిరాదిత్య సింధియా నవంబర్ 29న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ, మహమ్మారి పరిస్థితులు, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి విమానాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నట్లు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు మంత్రి. అయితే, తాజా అత్యవసర పరిస్థితులు దృష్ట్యా ఆ నిర్ణయంపై పునఃసమీక్షిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా