auranagabad man horse: పెరుగుతున్న ఇంధన ధరల నుంచి తప్పించుకోవడం కోసం ఓ వ్యక్తి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న.. కార్యాలయానికి వెళ్లడానికి గుర్రాన్నే వాహనంగా ఎంచుకున్నాడు. ఆయనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన షేక్ యూసఫ్.
వైబి చవాన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా షేక్ యూసుఫ్ పనిచేస్తున్నాడు. కొవిడ్ ముందు యూసుఫ్ వద్ద పాత బైక్ ఉండేది. లాక్‌డౌన్ సమయంలో అది పాడైంది. అప్పటికే పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో యూసఫ్‌కు.. గుర్రాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రస్తుత సమయంలో గుర్రంపై ప్రయాణం చేయడమే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని యూసఫ్ తెలిపాడు.
"లాక్‌డౌన్ సమయంలో నేను 'జిగర్' అనే గుర్రాన్ని రూ.40,000కు కొన్నాను. ఇదొక చక్కని కతియావారి జాతికి చెందిన గుర్రం. లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రజా రవాణాకు అనుమతి లేదు. గుర్రపు స్వారీ చేస్తూ ప్రయాణించడం వల్ల ఫిట్‌గా ఉండొచ్చు. వృద్ధాప్యం దరిచేరదు. ఈ గుర్రం యజమానికి విశ్వాసంగా ఉంటుంది."
-షేక్ యూసుఫ్, గుర్రం యజమాని
ఈ గుర్రం వయసు నాలుగేళ్లని యూసఫ్ చెబుతున్నాడు. అప్పుడప్పుడు చిన్నపిల్లలను సైతం గుర్రంపై తిప్పుతానని తెలిపాడు.
ఇదీ చదవండి: ఏడు పదుల వయసులోనూ.. డ్రైవింగ్‌పై బామ్మకు తగ్గని ఆసక్తి