ఉత్తర్‌ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించాడో వ్యక్తి. కుక్కను మోటార్ సైకిల్‌కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన గాజియాబాద్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటాల్ సైకిల్‌కు ఓ కుక్కను కట్టేసి ఈడ్చుకెళ్లాడు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్‌పోస్ట్ సమీపానికి రాగానే.. కుక్కను విచక్షణ రహితంగా ఈడ్చుకెళ్తున్న ఆ వ్యక్తిని స్థానికులు గమనించారు. నిందితుడిని బైక్‌లపై ఛేజ్ చేసి ఆపారు. అనంతరం పీఎఫ్ఏ (పీపుల్స్ ఫర్ యానిమల్స్) సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పీఎఫ్ఏ సభ్యులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సభ్యుల ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయమై నిందితుడిని విచారించగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని.. ఇటీవలే ఐదుగురిని కరిచి గాయపరిచిందని చెప్పాడు. అందుకే దాన్ని పట్టుకుని దూరంగా వదిలేయడానికి తీసుకెళ్తున్నానని తెలిపాడు. కాగా, నిందితుడు కుక్కను కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కుక్కను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలని పీఎప్ఐ సభ్యులు నిందితుడికి చెప్పారు.
కుక్క పిల్ల చేవులు కట్ చేసి.. మందుతో సేవించి..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. మూగ జీవాల పట్ల మనుషులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. ఇంతకుముందు మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించారు కొందరు మందుబాబులు. తాగి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కుక్క గట్టిగా మొరిగిందని.. దాని కాళ్లు చేతులు కట్టేసి ఉరి తీశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగింది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మందుబాబులు రెచ్చిపోయారు. రెండు కుక్కపిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించారు. వాటి చెవులను కత్తిరించి మందుతో కలిపి తాగారు. ఈ ఘటన బరేలి జిల్లాలో జరిగింది. అంతకుముందు కొందరు ఆకతాయిలు.. ఓ పెంపుడు కుక్కకు విషం కలిపిన మాంసం తినిపించి హత్య చేశారు. కాగా, అమ్మాయిలను వేధిస్తున్న ఆ ఆకతాయి యువకులు.. తమ ఇంటి సమీపానికి వచ్చినప్పుడు కుక్కలు అరిచినందుకే చంపేశారని యజమాని ఆరోపించారు.