గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్య కేసులో నిందితులకు జర్నలిస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య ముందు రోజు నిందితులకు జర్నలిస్టుల లాగా ఎలా ఉండాలి.. కెమెరా, ఇతర సాంకేతిక పరికరాలను ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాలపై వీరు శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. వీరంతా స్థానికంగా ఉన్న న్యూస్ వెబ్సైట్ కోసం పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. హంతకులకు సహాయం చేసిన వారిని బందా రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఈ హత్య కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని సిట్ బృందం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రయాగ్‌రాజ్ కోర్టు.. నిందితులకు బుధవారం నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అంతకుముందు హంతకులకు కోర్టు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. గత శనివారం అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడికి జర్నలిస్టుల్లా వచ్చిన అరుణ్ మౌర్య, సన్నీ సింగ్, లవ్లేష్ తివారీ.. మీడియా, పోలీసుల ముందే.. అతీక్, అష్రఫ్‌పై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు.
అతీక్ భార్య కోసం గాలింపు ముమ్మరం..
అతీక్ హత్య తర్వాత అతడి భార్య షైస్తా పర్వీన్ పరారైంది. ఆమె కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. కొందరు అనుమానితులు కౌశాంబీ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. బుధవారం పలు చోట్ల దాడులు జరిపారు. డ్రోన్ కెమెరాలతో రెండు గంటల పాటు ఆపరేషన్ చేపట్టారు. అయినా వారి అచూకీ తెలియలేదని ఎస్పీ సమర్ బహదూర్ తెలిపారు.
2005లో మొదలై..
2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి ఉమేశ్ పాల్‌ను ఫిబ్రవరి 24న కిరాతకంగా హత్య చేశారు. అతడి ఇద్దరు బాడీగార్డులను కూడా చంపేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉమేష్ పాల్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులతో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అతీక్ కుమారుడు అసద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
కేసు నమోదైన తర్వాత అసద్, అతీక్ అనుచరుడు గులామ్ పరారయ్యారు. దీంతో వీరిపై పోలీసులు రూ.5 లక్షల చొప్పున రివార్డులు ప్రకటించారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరు ఝాన్సీలో ఉన్నట్లు సమాచారం అందుకుని అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి కాల్పులు జరిపారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు.