Second Dan blackbelt in Karate: నేర్చుకునే తపన ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఓ వృద్ధుడు. 58 ఏళ్లకు కరాటే నేర్చుకోవటం ప్రారంభించి.. 75 ఏళ్ల వయసులో రెండో ర్యాంక్ బ్లాక్ బెల్ట్ సాధించి ఔరా అనిపించారు. తన కిక్కులతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయనే.. కేరళ, ఇడుక్కికి చెందిన ఎస్టీ అగస్టీ. గతంలో ఇడుక్కిలోని కామాక్షి గ్రామ సర్పంచ్‌గానూ చేశారు. ఆయనను అచోయ్ అన్న అని పిలుస్తారు.
రోజులో ఎక్కువ సమయాన్ని మార్షల్ ఆర్ట్స్ సాధన కోసం ఉపయోగిస్తారు అగస్టీ. ఈ విద్యలో నైపుణ్యం సాధించాలంటే శారీరక దృఢత్వం చాలా అవసరం. మాస్టర్ కవలక్కట్ జోష్ ఆధ్వర్యంలో తనలోని కరాటే నైపుణ్యాన్ని ప్రదర్శించి సెకండ్ డాన్ బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకున్నారు అగస్టీ. కరాటేలో ఈ స్థాయికి రావటం అంత సులభమేమీ కాదు. ముఖ్యంగా పెద్ద వయసులో నేర్చుకోవటం ప్రారంభించిన వారికి మరింత కఠినంగా ఉంటుంది. అగస్టీ ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంటారు. శారీరక దృఢత్వంలో యువకులతో పోటీ పడతారు. నేర్చుకోవటం ప్రారంభించిన నాలుగేళ్లలోనే మొదటి ర్యాంక్ బ్లాక్ బెల్ట్ సాధించారు.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే తపన, నిబద్ధతకు అగస్టీ నిదర్శనమని ఆయన మాస్టర్ కవలక్కట్ జోష్ తెలిపారు. అదే కరాటేలో ఈ స్థాయికి చేరుకునేందుకు ఉపయోగపడిందన్నారు. ప్రతిరోజు కరాటే సాధనం చేయటం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తన ధరి చేరలేదని చెప్పారు అగస్టీ.
" మా పిల్లలు కరాటే నేర్చుకునేందుకు వెళ్తుండటం వల్ల నాకు ఆసక్తి కలిగింది. నా 58 ఏళ్ల వయసులో కవలక్కట్ జోష్ మాస్టర్ వద్ద కరాటే నేర్చుకోవటం ప్రారంభించాను. 62 ఏళ్ల వయసులో మొదటి డాన్ బ్లాక్ బెల్ట్ సాధించాను. ఈ వయసులో కరాటేలో నా నైపుణ్యాన్ని ప్రదర్శించగలగటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది."
- అగస్టీ
కరాటే, వ్యాయామం చేయటం వల్ల తాను ఒత్తిడికి లోనవ్వనని, మధుమేహం, చెడు కొవ్వు వంటివి లేవన్నారు అగస్టీ. ఈ వయసులో ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకునేందుకు వ్యాయామం చాలా మంచిదని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం మహిళలు, చిన్నారులు ఈ మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే.. 70 ఏళ్ల వయసులో..