పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. శారీరక సంబంధం పెట్టుకొని.. ఆ తర్వాత జాతకాల కలవట్లేదని (astrological compatibility for marriage) వివాహానికి నిరాకరించటం సరికాదని స్పష్టం చేసింది బాంబే హైకోర్టు(Bombay high court news ). అది ఉద్దేశపూర్వకంగా చేసిన మోసమని తెలిపింది. అత్యాచారం, మోసం కేసు విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును కొట్టివేయాలని దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది.
తనపై నమోదైన అత్యాచారం, మోసం కేసును కొట్టివేయాలని బోరువల్లికి చెందిన అవిశేక్ మిత్రా(32) అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది జస్టిస్ ఎస్కే షిండే ధర్మాసనం(Bombay high court news ). ఈ సందర్భంగా వాదనలు వినిపించిన మిత్రా తరఫు న్యాయవాది రాజా ఠాక్రే.. జాతకాలు కలవనందున.. నిందితుడు, ఫిర్యాదుదారు మధ్య సంబంధం కొనసాగదని తెలిపారు. ఇది అత్యాచారం, మోసం కేసు కాదని, వాగ్దానాన్ని ఉల్లంఘించటం మాత్రమేనని పేర్కొన్నారు. పెళ్లి చేసుకోకుడదనే ఆలోచన మిత్రాలో లేదని, అసలు ఆ వాగ్దానమే నిజం కాదన్నారు. అనంతరం స్పందించిన న్యాయస్థానం ఎస్కే షిండే వాదనలతో విభేదించింది.
"ఈ వాదనలను ఆమోదించలేం. ఫిర్యాదు చేసిన మహిళను పెళ్లి చేసుకునే ఆలోచన మిత్రాకు మొదటి నుంచే లేనట్లు కనిపిస్తోంది. జాతకాలు కలవట్లేదనే ముసుగులో అతడు ఇచ్చిన మాటను తప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వివాహం చేసుకుంటానని నమ్మబలికే తప్పుడు వాగ్దానంగా దీన్ని నమ్ముతున్నాం."
- హైకోర్టు.
కేసు ఏమిటి?
2012లో నిందితుడు మిత్రా, బాధితురాలు ఓ 5స్టార్ హోటల్లో పని చేస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలోనే ఇరువురి మధ్య సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు సందర్భాల్లో తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గర్భం దాల్చగా.. వివాహం చేసుకోవాలని మిత్రాను కోరానని, అందుకు అతను నిరాకరించాడని తెలిపింది. చిన్న వయసులో పెళ్లి సరికాదని, అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.
ఈ వ్యవహారం తర్వాత బాధితురాలిని దూరం పెట్టటం ప్రారంభించాడు మిత్రా. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసులో భాగంగా మిత్రాను పిలిచి.. కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. దాంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని పోలీసులతో చెప్పాడు మిత్రా. కానీ, కొన్ని రోజుల్లోనే.. మళ్లీ తన బుద్ధిని బయటపెట్టాడు. బాధితురాలితో మాట్లాడటం మానేశాడు. మరోమారు పోలీసులను ఆశ్రయించగా.. అత్యాచారం, మోసం కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: తల్లి మతమార్పిడిపై ఎమ్మెల్యే ఆవేదన- చట్టం తెస్తామన్న మంత్రి