చైనాతో ఒప్పందం ప్రకారం.. మోదీ సర్కారు భారత భూభాగాన్ని ఆ దేశానికి అప్పగించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. బలగాల ఉపసంహరణ సందర్భంగా.. తమ భూభాగాన్ని చైనాకు వదులుకోలేదని నొక్కిచెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత భూభాగం ఫింగర్ 4 వరకు ఉందన్నది అవాస్తవం అని స్పష్టం చేసింది.
తప్పుడు ఆరోపణలతో సైన్యం త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికింది.
''సైన్యం త్యాగాలతో సాధించిన విజయాలను అవమానించడమంటే.. వారిని అగౌరవపర్చడమే. 1962 నుంచి 43వేల చదరపు కిలోమీటర్లకుపైగా భారత భూభాగం చైనా ఆక్రమణలో ఉన్నట్లు మన మ్యాప్‌లోనూ స్పష్టంగా ఉంది. అందుకే మన భూభాగంపై చైనాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు.''
- రక్షణ శాఖ ప్రకటన
దేశ ప్రయోజనాలు ప్రాంతీయ పరిరక్షణకు దృఢ సంకల్పంతో ఉన్నామని తేల్చిచెప్పిన రక్షణ శాఖ.. సైన్యం శక్తి సామర్థ్యాలపై తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని నొక్కిచెప్పింది. భారత్ అంచనా ప్రకారం.. వాస్తవాధీన రేఖ కూడా ఫింగర్ 8 వద్దే ఉందని, ఫింగర్ 4 వద్ద కాదని ఓ ప్రకటన వెలువరించింది. అందుకే.. ఫింగర్ 8 వరకు పెట్రోలింగ్ నిర్వహించే హక్కు భారత్‌కు ఉందని చైనాకు స్పష్టం చేసినట్లు వివరించింది.
పాంగాంగ్ త్సో ఉత్తర ఒడ్డున భారత్, చైనా శాశ్వత శిబిరాలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపింది. మన స్థావరం ఫింగర్ 3 వద్ద ఉండగా, చైనాది ఫింగర్ 8 వద్ద ఉందని గుర్తుచేసింది రక్షణ శాఖ. ఇరుదేశాల బలగాలు ముందుకు రాకుండా ఎవరి స్థావరాల వద్ద వారు ఉండేలా ప్రస్తుత ఒప్పందం జరిగిందని తెలిపింది.
అంతకుముందు.. ఫింగర్ 4 మన భూభాగంలో ఉంటే ఫింగర్ 3 వరకు వెనక్కి రావడం ద్వారా మోదీ సర్కారు దేశ భూభాగాన్ని చైనాకు ఇచ్చేసిందని రాహుల్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ పైవ్యాఖ్యలు చేసింది.
ఇదీ చూడండి: 'భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన ప్రధాని'